మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్
By సుభాష్ Published on 31 Jan 2020 10:14 AM ISTజనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పాటైన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజా సేవకే అంకిత అవుతానని చెప్పి, ఇప్పుడు సినిమాల వైపు వెళ్లడంపై తీవ్ర అభ్యంతకర వ్యక్తం చేసిన లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పవన్ కల్యాణ్‌కు పంపించారు. పార్టీని వీడటం పవన్ కల్యాణే కారణమని చెప్పుకొచ్చారు. మళ్లీ సినిమాల్లో నటించడం తనకు నచ్చలేదంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలుపుతూ సెటైరికల్‌గా సమాధానమిచ్చారు.
వివి లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామంటూ జనసేన అధికారిక ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీని నడిపేందుకు తనకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని, సినిమాలు చేయడమే నాకు తెలుసు.. వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు.. అవన్నీ తెలిసి ఉంటే బాగుండూ అని పవన్ వ్యాఖ్యనించారు.
పవన్ లేఖ సారాంశం చూస్తే..
వివి లక్ష్మీనారాయణ గారి భావలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం. నాకు సిమెంట్, ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీ ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా, నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు అంటూ పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.