వైసీపీకి పవన్ శాపనార్థాలు
By రాణి
వైసీపీ ప్రభుత్వానికి జనసేనాని పవన్ కల్యాణ్ శాపనార్థాలు పెట్టారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాజధాని రైతుల గోడు విన్న అనంతరం పవన్ మాట్లాడారు. రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం లేకుండా ఏం చేయాలో అదే చేస్తానన్నారు. రైతులు, మహిళల్ని ఏడిపించిన వారు సర్వనాశనమైపోతారని, కూల్చివేతలతో మొదలుపెట్టిన వారు కూలిపోక తప్పదని జనసేనాని శపించారు. ఇది మా రాజధాని అనిపించేలా జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని పవన్ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని తిట్టినా భరిస్తున్నాను...ఏమీ చేయననుకుంటే పొరపాటేనన్నారు. వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను కక్కేలా చేస్తానన్నారు.
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పవన్ బల్లగుద్ది మరీ మరోసారి చెప్పారు. జగన్ రెడ్డి మూడు కాదు కదా..ముప్పై రాజధానులు పెట్టినా చివరికి ఒక్క రాజధానిగా చేసి తీరుతామని పవన్ రైతులతో అన్నారు. తమకు అన్యాయం జరుగుతుందని రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే...వారిపై పోలీసులతో దాడులు చేయడం అమానుషమన్నారు.
వైసీపీ నేతలకు అమరావతి భూములు ఉండి ఉంటే..రాజధానిని విశాఖకు తరలించాలన్న ఆలోచనే వచ్చి ఉండేది కాదేమోనన్నారు పవన్ కల్యాణ్. వారికి సంబంధించిన భూములన్నీ విశాఖలోనే ఉన్నాయని, అందుకే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో విశాఖకు రాజధానిని తరలించడం లేదన్నారు. అమరావతిని ఆంధ్ర శాశ్వత రాజధానిగా ఉంచుతామని బీజేపీ చెప్పడంతోనే పొత్తు పెట్టుకున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు కాబట్టే..తమకు అంత గౌరవం ఉందన్నారు. ఇవాళ అమరావతిని మోసం చేసిన వాళ్లు.. రేపు కడప, విశాఖ, ఇలా అందరినీ మోసం చేస్తారని ప్రభుత్వంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజధాని కోసం అరఎకరం భూమి ఇచ్చిన మూగ రైతు కిరణ్ పై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారని పవన్ భావోద్వేగానికి గురయ్యారు. ఒంటిపై దెబ్బపడితే గట్టిగా అరిచి తన ఆవేదనను చెప్పుకోలేని అతడిని చూస్తుంటే..బాధ తన్నుకొస్తోందన్నారు. అతని బాధను ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు గానీ..భగవంతుడు అన్నీ గమనిస్తాడు. పాపం పండిన రోజు వైసీపీ అధికారం కోల్పోతుందన్నారు.