పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్

By సుభాష్  Published on  20 May 2020 1:07 PM GMT
పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్

లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. చాలా మందికి తినడానికి తిండి కూడా లేని దీన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అన్న ఆశతో చూస్తూ ఉన్నారు. పురోహిత్యాన్ని నమ్ముకున్న బ్రాహ్మణుల పరిస్థితి కూడా అలాంటిదే. ప్రస్తుతం పెళ్లిళ్లకు ఎటువంటి అనుమతి లేకపోవడంతో వివాహాలు లేవు, శుభకార్యాలను కూడా చాలా మంది నిర్వహించకపోవడంతో ఎటువంటి ఉపాధి కూడా లేకుండా ఉన్నారు. ఆర్థికంగా కుదేలైన పురోహితుల కుటుంబాలను, బీద బ్రాహ్మణులను ఆదుకోవాలని జనసేన పార్టీ కోరింది.

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా పురోహిత్యాన్ని నమ్ముకున్న చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. ముహూర్తాలు ఉన్నప్పటికీ పెద్దగా శుభకార్యాలు జరపకపోవడంతో ఉపాధి లభించడం లేదు. చిన్న చిన్న కార్యక్రమాలను కూడా పురోహితులు నిర్వహించడం లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘం ప్రస్తుతం వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేశారు. మే 24 తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని తేజోమూర్తుల లక్ష్మి నరసింహ మూర్తి తెలియజేశారు.

ఇలాంటి కష్టకాలంలో పేదరికంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు 5000 రూపాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. వారి కోరికలో నిజముందని.. ప్రభుత్వం అండగా నిలబడాలని జనసేన తరపున పవన్ కళ్యాణ్ కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయలను కూడా ప్రక్కదోవ పట్టకుండా వారి కోసమే వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు, విద్యార్థులకు ఈ ఫండ్స్ ను అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు. అందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ ను జనసేన తాజాగా విడుదల చేసింది.Next Story