కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా.. సి యు సూన్ అంటూ ట్వీట్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2020 8:55 AM GMT
కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా.. సి యు సూన్ అంటూ ట్వీట్.!

కన్నడ సినిమాగా విడుదలై పాన్‌ ఇండియా సినిమాగా భారీ విజయాన్ని అందుకుంది కేజీఎప్‌-చాప్టర్‌ 1 చిత్రం. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, హీరో యశ్‌ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండగ రోజు(అక్టోబర్‌ 23న) ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రచారం జరిగింది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయి.

కేజీఎఫ్-2 ముగిశాక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం ఎంత వరకూ నిజమో తెలుసుకోవాలంటే ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే20 వరకూ ఆగాల్సిందే అని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈరోజు ప్రశాంత్ నీల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.ఒక అణు కర్మాగారంతో ప‌నిచేయ‌డం ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు.. క్రేజీ ఎన‌ర్జీతో త్వ‌ర‌లోనే రేడియేష‌న్ సూట్ తీసుకువ‌స్తాను. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుస్తాం అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతోందని ఈ ట్వీట్ ద్వారా తెలిసిపోతోంది. కేజీఎఫ్ సినిమా ద్వారా ఒకరేంజిలో హీరోయిజం చూపించిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ను ఏ స్థాయిలో చూపిస్తాడో అని అభిమానులు వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేయనున్నాడు. అది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమా మొదలుకావచ్చు.

Next Story