కరోనాతోనే కాదు స్టైరీన్‌తోనూ సహజీవనం చేయాలా..? : పవన్
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 10:02 PM ISTఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి పరిహారం ఇచ్చారు కానీ, ఆ పరిశ్రమ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల జీవన్మరణ సమస్యకు పరిష్కారం ఎప్పుడు చూపుతారని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలదీశారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం స్టైరీన్ మృత్యువాయువుతో సైతం సహజీవనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతోందని పవన్ ఎద్దేవా చేశారు.
స్టైరీన్ గ్యాస్ పీల్చిన వారు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోబోయే అవకాశం ఉందని, గ్యాస్ బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడేలా ఉండాలన్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించబట్టి ఎన్నో ప్రాణాలు నిలిచాయని, లేకపోతే పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలైన వెంకటాపురం, పద్మాపురం, నందమూరి నగర్, వెంకటాద్రి గార్డెన్స్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని తెలిపారు.