పంజాబ్‌లో దారుణం.. ఏఎస్ఐ చేతిని నరికేశారు
By తోట వంశీ కుమార్ Published on 12 April 2020 3:40 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. అధికారులు, ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఎంత చెబుతున్నా పలువురు ఆ నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. లాక్‌డౌన్ నిబందనలు ఉల్లగించకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. తాజాగా పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ వాహానాన్ని ఆపి పాసులు చూపించమన్నందుకు పోలీసులపై దాడి చేశారు కొందరు దుండగులు. ఓ పోలీస్ చేయిని నరికేశారు.
పటియాల సమీపంలోని మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం ఓ వాహనాన్ని ఆపి పాసులు చూపించాలని అడిగారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారీకేడ్లను ఢీ కొట్టారు. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడికి దిగారు. ఆయుధాలతో దాడి చేసి ఏఎస్ఐ చేతిని నరికేశారు. ఈ దాడిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మోచేతికి, మరో అధికారి చేతికి గాయాలయ్యాయి. ఆ వాహానంలో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది.
దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ పోలీసులను సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం చంఢీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కి తీసుకెళ్లారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.