పార్లమెంటు సెంట్రల్ హాల్ అంటే ఏదో ఒక హాల్ లాంటిది కాదు. దానికి తనదైన చరిత్ర, ప్రాధాన్యం ఉన్నాయి. అక్కడ పార్లమెంటు సంయుక్ సమావేశాలు జరుగుతాయి. అయితే అందువల్లే అది ప్రముఖమైన ప్రదేశం కాదు. అక్కడ ప్రభుత్వ విపక్షాల సభ్యులు కలిసి వివిధ విషయాలపై చర్చించుకుంటారు. కలిసి వివిధ విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. అంతే కాదు. పలువురు జర్నలిస్టులు ఈ హాలులోనే తిరుగాడుతూ, దేశ రాజకీయాల పట్ల అవగాహనను పెంచుకుంటారు. సమాచారాన్ని పంచుకుంటారు.

అయితే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత సెంట్రల్ హాల్ లోకి విలేఖరుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. బిజెపి నేతలు సెంట్రల్ హాల్ లో విలేఖరులతో మాట్లాడటం బాగా తగ్గించారు. దీంతో విలేఖరులకు సమాచారం అందడం బాగా తగ్గిపోయింది. రెండవ సారి గెలిచిన తరువాత సెంట్రల్ హాల్ లో జర్నలిస్టుల ప్రవేశం ఇంకా బాగా తగ్గింది. అసలు పూర్తిగా విలేఖరులను రానీయరేమోనన్న భయాందోళనలు కూడా పెరిగాయి. అయితే ఇటీవలే తనతో మాట్లాడిన ఒక విలేఖరికి స్పీకర్ ఓం బిర్లా అలాంటి ప్రతిపాదనేమీ లేదని చెప్పారు.

కాగా ఇప్పుడు పార్లమెంటు సెంట్రల్ హాల్ కు కొన్ని మరమ్మత్తులు చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా విలేఖరుల రాకపోకలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మరమ్మత్తులు చేపట్టనున్న కాంట్రాక్టర్ సంయుక్త సమావేశాలు లోకసభ హాల్లోనూ నిర్వహించవచ్చునని సూచించినట్టు, దానికి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. రెండు హాల్స్ ఉంటే చాలని, సెంట్రల్ హాల్ అవసరం లేదని కూడా ఆయన అన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద విలేఖరులు సెంట్రల్ హాల్ లో తచ్చాడి, అక్కడి సమాచారం ఇక్కడికి, ఇక్కడి సమాచారం అక్కడికి అందించే పనిని చేయలేరన్న మాట.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.