పరీక్షా పే చర్చ మూడవ ఎడిషన్‌లో భాగంగా ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేడు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. 2019లో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 మిషన్ విఫలమైందని ప్రధాని మోదీ విద్యార్దుల‌కు గుర్తుచేశారు. ఆ ప్రయోగం చాలా క్లిష్టమైనదని.. స‌క్సెస్‌ అవుతుందో లేదో తెలియదని.. ఆ కార్యక్రమానికి వెళ్లకండంటూ పలువురు సూచించార‌ని.. విఫలమైతే ఏమౌతుంద‌ని తాను వారిని ఎదురు ప్రశ్నించి శ్రీహరికోటకు వెళ్లాన‌ని ప్రధాని విద్యార్దుల‌తో అన్నారు.

అలాగే.. చంద్రయాన్-2 విఫలం అవ‌డం ప‌ట్ల తాను ఎంతో బాధపడ్డాన‌ని.. ఈ మిషన్ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా కొన్ని మాటలు కూడా చెప్పాన‌ని మోదీ గుర్తుచేశారు. అంతేకాకుండా.. శాస్త్ర‌వేత్త‌ల‌ శ్రమ ఎంతో అమూల్యమైంద‌ని.. నా మాటలతో వారిలో నూత‌న‌ ఉత్తేజాన్ని నింపినట్లు మోదీ అన్నారు. అఖండ భార‌తావ‌ని మీ వెన్నంటే ఉంద‌ని వారితో చెప్పినప్పుడు శాస్త్రవేత్తలు.. చంద్రయాన్-2 విఫలమైంద‌న్న‌ బాధ నుంచి బయటపడ్డారని.. అప్పుడు వారిలో తెలియని ధైర్యం కనిపించిందని మోదీ విధ్యార్దుల‌తో అన్నారు. అప్పుడు నేను చెప్పిన మాటలు కేవ‌లం శాస్త్రవేత్తలకే కాదు యావత్ భారతావ‌ని మూడ్‌ను మార్చివేసిందని.. అప‌జ‌యాల నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చని విద్యార్థులతో ప్రధాని మోదీ అన్నారు.

అలాగే.. 2001లో టీమిండియా-ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన‌ మ్యాచ్ గురించి కూడా మోదీ విద్యార్థుల ముందు ప్రస్తావించారు. మ్యాచ్ కీల‌క స‌మ‌యంలో ప్ర‌ధాన‌ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడ్డారని.. అయినా సరే.. భారత్ విజయం కోసం కష్టపడి.. అనుకున్న విజయాన్ని అందించాడ‌ని మోదీ విద్యార్దుల‌తో అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కొంటామో అన్న‌ దానిపైనే విజ‌యం ఆధారపడి ఉంటుంద‌ని ప్రధాని అన్నారు. అలాగే.. ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా టీమిండియాకు విజయం క‌ష్ట‌త‌ర‌మైన త‌రుణంలో ద్రవిడ్, లక్ష్మణ్ నెలకొల్పి రికార్డు భాగ‌స్వామ్యం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటుంద‌ని అన్నారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా ఆలోచిస్తే విజయాలు వాటంతట అవే వస్తాయని ప్ర‌ధాని విద్యార్థుల‌ను చైత‌న్య ప‌రిచారు.

ఇదిలావుంటే.. 10, 12వ తరగతి విద్యార్థులు మరికొన్ని రోజుల్లో ప‌రీక్ష‌లు రాయనున్న నేఫ‌థ్యంలో.. వారిలో భయాన్ని తొలగించే కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రధాని మోదీ ప్రతి ఏటా విద్యార్థులతో ముచ్చటించడం జరుగుతోంది. దీనిలో బాగంగానే పరీక్షలంటే ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల కోసం కొన్ని చిట్కాలను కూడా ప్రధాని మోదీ వారితో పంచుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బాగంగా దేశవ్యాప్తంగా ఉన్న‌ 2వేల మంది విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.