జనవరిలో పంజ్ తీర్థ్ ఆలయాన్ని తెరుస్తున్న 'పాకిస్తాన్'

By Newsmeter.Network  Published on  27 Dec 2019 9:32 AM GMT
జనవరిలో పంజ్ తీర్థ్ ఆలయాన్ని తెరుస్తున్న పాకిస్తాన్

ముఖ్యాంశాలు

  • దేశ విభజన సమయంలో మూతపడ్డ హిందూ ఆలయాలు
  • కర్తార్ పూర్ కారిడార్ లోని గురుద్వారాలను తెరిచిన పాక్
  • భారతీయ యాత్రికులకు వాటిని సందర్శించేందుకు అనుమతి
  • స్పిరిట్యువల్ టూరిజం ద్వారా ఆదాయంకోసం ప్రయత్నాలు
  • సందర్శనకు 20 డాలర్ల సుంకాన్ని విధించిన పాక్ ప్రభుత్వం
  • పాక్ పౌరులకు ఈ పవిత్ర స్థలాల సందర్శనకు రూ.200 సుంకం

అమృత్ సర్ : పాకిస్తాన్ ఇప్పుడు మరో హిందూ దేవాలయాన్ని తెరిచేందుకు నిర్ణయించింది. దేశ విభజన సమయంలో మూసేసిన హిందూ ఆలయాల్లో మూడింటిని ఇప్పటికే తెరిచిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా పంజ్ తీర్థ్ ఆలయాన్నికూడా తెరవడమేకాకుండా భారతీయులు ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వబోతోంది. పెషావర్ లో ఉన్న పంజ్ తీర్థ్ ఆలయాన్ని జనవరి 2020లో తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

పాండవులు కొంతకాలంపాటు ఇక్కడ నివసించినట్టు, పాండవుల చేతిమీదుగా ఈ ఆలయ ప్రతిష్ఠాపన జరిగినట్టు పురాణ కథనం. కైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ ఈ ప్రదేశాన్ని జాతీయ వారసత్వ సంపదగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఎవక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ చైర్మన్ అమీర్ అహ్మద్ దేశంలో ఉన్న పురాతన ఆలయాలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఆలయాన్ని జనవరి నెలలో తెరవబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని తెరిస్తే ఈమధ్యకాలంలో తెరిచిన రెండో హిందూ ఆలయంగా ఇది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సియాల్ కోట్ లోని వెయ్యి సంవత్సరాలనాటి శివాల తేజ్ సింగ్ ఆలయాన్ని పాక్ ప్రభుత్వం అక్టోబర్ నెలలో తెరిచింది.

పాకిస్తాన్ హిందూ దేవాలయాల పునరుద్ధరణకు

జీలంలో రోహ్ తాస్ ఫోర్ట్ సమీపంలో ఉన్న గురుద్వార్ ఛోవా సాహెబ్ ని తెరవడంతో పాకిస్తాన్ హిందూ దేవాలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందీమధ్యకాలంలో. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. కర్తార్ పూర్ కారిడార్ లో ఉన్న ఈ ఆలయం వందల సంవత్సరాలుగా సిక్కులకు అత్యంత పవిత్రమైన దర్శనీయ క్షేత్రంగా భాసిల్లుతోంది. గురునానక్ ఈ ప్రదేశంలో సంకల్పమాత్రం చేత భూమినుంచి జలధారలను పైకి రప్పించినట్టుగా చారిత్రక కథనం. మహరాజ్ రంజీత్ సింగ్ ఈ గురుద్వార్ ని నిర్మించారు.

దేశ విభజన సమయంలో మూతపడిన సిక్కుల మరో పవిత్రధామంగా భాసిల్లుతున్న గుజ్రన్ వాలాలో ఉన్న చారిత్రక గురుద్వారా ఖరా సాహిబ్ ను కూడా పాకిస్తాన్ జూలైనెలలో తెరిచింది. గురు హరిగోవింద్ సింగ్ స్మృత్యర్థం ఈ గురుద్వార్ నిర్మితమయ్యింది.

ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో దూసుకుపోతున్న భారత ప్రభుత్వం అనేకమైన కీలక నిర్ణయాలను తీసుకోవడంతో పాకిస్తాన్ లో ఇమ్రాన్ ప్రభుత్వానికి చేష్టలుడిగిన పరిస్థితి తలెత్తింది. బలమైన శత్రువుగా భావించే దాయాది దేశం దూకుడును ఎదుర్కొనే పరిస్థితి పాకిస్థాన్ కి కనుచూపుమేరలో కనిపించని నేపధ్యంలో పాక్ భారత్ తో స్నేహపూర్వకమైన, సామరస్యమైన రీతిలో వ్యవరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను పంపేందుకు అన్నివిధాలుగానూ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

విభజన సమయంలో మూతపడిన పాక్ లోని హిందూ ఆలయాలను తెరవడం ద్వారా, భారతీయ యాత్రికులను ఆ ఆలయాలను సందర్శించడానికి అనుమతించడం ద్వారా భారత్ తో స్నేహ సంబంధాలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న సందేశాన్ని పంపే ప్రయత్నం గట్టిగా చేస్తోంది పాక్.

1992లో బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత పాకిస్తాన్ లోని అనేక చారిత్రక, ప్రముఖ హిందూ దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రస్తుతం పాక్ ఆర్థికంగా అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ లోని హిందూ దేవాలను పునరుద్ధరించడంద్వారా భారతీయ యాత్రికులు అక్కడికి వెళ్లి తమ ఇష్టదైవాలను, గురువులను దర్శించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కొంతమేరకు టూరిజం పెరిగి కాస్తో కూస్తో ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉటుందా దేశానికి.

ఈ పవిత్ర ఆలయాలను కర్తార్ పూర్ కారిడార్ మీదుగా వచ్చి దర్శించుకోవాలనుకునే భారతీయ యాత్రికులకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేకమైన రుసుమును నిర్ణయించింది. భారతీయ యాత్రికులు ఈ ఆలయాలను సందర్శించడానికి ఇరవై డాలర్లు సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లోని సిక్కుమతానికి చెందనివారు ఈ ఆలయాలను దర్శించుకోవాలంటే రూ.200 సుంకం చెల్లించాలి. ఈ నేపధ్యంలో శారదాపీఠాన్ని దర్శించే అవకాశాన్నికూడా కల్పించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది.

Next Story