సుస్వర రసరాజు.. పండిట్‌ జస్‌రాజు

By మధుసూదనరావు రామదుర్గం  Published on  18 Aug 2020 12:35 PM GMT
సుస్వర రసరాజు.. పండిట్‌ జస్‌రాజు

తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వాయులీనాలుగా.. సంగీతమే తన మాతృభాషగా ప్రపంచ సంగీత ప్రియుల మనసుల్లో చెదరని ముద్ర వేసిన పండిట్‌ జస్‌రాజ్‌ భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన నాదోపాసకుడు. సంగీత జ్ఞానము భక్త వినా సన్మార్గము కలదే అన్న సంప్రదాయ సంగీత నిధి త్యాగరాజులాంటి మహా విద్వాంసులు జన్మించిన ఈ నేలలో జస్‌రాజ్‌ స్వర సాధకుడిగా ఎదిగి ఎందరో శిష్యులను తన స్వరవారసులుగా తీర్చి దిద్దారు. అమెరికా న్యూజెర్సీలోని తన నివాసంలో సోమవారం దివంగతులయ్యారు. తొంబై ఏళ్ళ వయసులో ఆయన కనుమూశారు. తమ జీవితంలో ఎనిమిది దశాబ్దాలుగా సంగీతాన్ని తన స్వరపల్లకిలో ఊరేగించారు. ప్రపంచ సంగీత ప్రేమికులు జస్‌రాజ్‌కు ఘననివాళులిడుతున్నారు.

సంగీత మర్తాండ్‌ జస్‌రాజ్‌ మేవాతి ఘరానా శైలికి చెందిన సంగీత విద్వాంసులు. హర్యానాలోని హిసార్‌ జిల్లా పిలిమండోరిలోని ఒక సంగీత కుటుంబంలో 1930న జస్‌రాజ్‌ జన్మించారు. తండ్రి మోతిరామ్‌ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. జస్‌రాజ్‌ నాలుగేళ్ళ వయసున్నప్పుడు మోతిరామ్‌కు హైదరాబాద్‌ నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నుంచి ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఆహ్వానం అందింది.

అయితే తను వెళ్ళాల్సిన రోజే మోతిరామ్‌ స్వర్గస్తులయ్యారు. అప్పటికే జస్‌రాజ్‌ అగ్రజుడు మణిరామ్‌ సంగీతసాధన పూర్తి చేసి కచేరీలు ఇస్తుండేవాదు. ఈ నేపథ్యంలో తండ్రికి దక్కిన అవకాశం మణిరామ్‌ అందుకున్నాడు. ఆయనతోపాటు కుటుంబం అంతా హైదరాబాద్‌కు తరలివచ్చింది. జస్‌రాజ్‌ బాల్యం యవ్వనం హైదరాబాద్‌లోనే గడిచింది. జస్‌రాజ్‌ మరో సోదరుడు పండిట్‌ ప్రతాప్‌ నారాయణ్‌కు ఆనువంశిక సంగీతజ్ఞానం అలవడింది. మణిరామ్‌ వీరిద్దరికి సంగీత పాఠాలు నేర్పే పూనిక వహించాడు. మోతిరామ్‌ పండిట్‌ ముగ్గురు కుమారులు సంగీత త్రిమూర్తులుగా వాసికెక్కారు. తమ తండ్రికి అసలైన నివాళి స్వరాభివృద్దితో అందివ్వగలిగారు.

పుట్టుకతోనే తండ్రి స్వర వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జస్‌రాజ్‌ చిన్ననాడే బేగం అక్తర్‌ ప్రభావం విచిలితంగా ఉంది. చిన్నప్పుడు బడికి వేళ్లే దారిలో బేగం అక్తర్‌ పాటల రికార్డు వినిపించేది. రోజూ ఈ స్వర మాధుర్యాన్ని విని జస్‌రాజ్‌ మైమరచిపోయే వాడు. జస్‌రాజ్‌ తొలినాళ్లు సోదరుడి వద్ద తబలా నేర్చుకున్నాడు. అయితే చాలా త్వరగా జస్‌రాజ్‌కు ఓ సత్యం బోధపడింది. ప్రధాన విద్వాంసుడికే తప్ప పక్క వాయిద్యకారులకు అంతగా ప్రాధాన్యం దక్కదని తెలిసింది. కొన్ని అనుభవాలు ఈ సత్యాన్ని బలపరిచాయి. అందుకే తను ఎలాగైనా గవాయ్యా కావాలని కలలు కన్నాడు. అది నిజం చేసుకున్నాడు.

స్వాతంత్య్రానంతరం నిజాం సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో మణిరామ్‌ తన మకాం కోల్‌కతాకు మార్చాడు. 1960లో జస్‌రాజ్‌ బోంబేలో ఒక కచేరీ సందర్భంలో తొలిసారిగా మధురా శాంతారామ్‌న కలిశారు. ప్రముఖ దర్శకుడు వి.శాంతారామ్‌ కుమార్తె మధురాశాంతారామ్‌ను 1962లో వివాహమాడారు. అనంతరం నివాసాన్ని బోంబేకు మార్చారు.

మేవారీ ఘరానాకు చెందిన గులాం ఖాదిర్‌ఖాన్‌. దాముజీల వద్ద సుశిక్షితుడైన జస్‌రాజ్‌ దేశవిదేశాల్లో పలు కచేరీలు చేసి పేరు సంపాదించారు. భార్య వైపు నుంచి సినిమా వారు పరిచయం కావడంతో కొన్ని సినిమాల్లోనూ సంగీతం అందించారు. 1966లో వసంత్‌ దేశాయ్‌ స్వరకల్పనలో లడ్కీ సహ్యాద్రికీ సినిమాలో పాట పాడారు. అలాగే బీర్బల్‌ మై బ్రదర్‌లో పండిట్‌ భీమ్‌సేన్‌ జోషితో కలిసి గానం చేశారు. 2009లో శ్రీమతి మధురాశాంతారామ్‌ సంగీత మార్తాండ్‌ పండిట్‌ జస్‌రాజ్‌ పేరిట ఓ బయోపిక్‌ తీశారు.

సంగీతం విశ్వజనీనం దాన్ని ఏ చట్రంలోనూ ఇమడ్చరాదని నమ్మిన జస్‌రాజ్‌ సంప్రదాయ సంగీత చాదస్తాలను పట్టించుకోలేదు. ఆయన తన కచేరీలో విభిన్న ఘరానాలకు చెందిన స్వరవిన్యాసాలు చేసేవారు. స్వరమాధుర్యాన్ని ఆస్వాదించే శ్రోతలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సామాన్యులను త్వరగా ఆకట్టుకునే హవేలీ సంగీతానికి పెద్దపీట వేసేవారు.

పండిట్‌ జస్‌రాజ్‌ సంగీత ప్రజ్ఞకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది. విశ్వసంగీతంలో జస్‌రాజ్‌ ఓ సమున్నత శిఖరం. ఆయన స్వరమే కాదు ఆయన విద్వత్తూ ఎప్పటికీ ఓ చెదరని సంతకం!!

Next Story