నవాజ్ షరీఫ్ ఇకపై పరారైన నిందితుడు

By అంజి  Published on  27 Feb 2020 3:04 AM GMT
నవాజ్ షరీఫ్ ఇకపై పరారైన నిందితుడు

ఇస్లామాబాద్‌: ఇష్టం వచ్చినట్టుగా బెయిల్ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా పరిగణిస్తూ పాకిస్తాన్ నిర్ణయించింది. దానితో పాటు ప్రభుత్వం తరపున ఆయనకు అందిస్తున్న గ్యాస్‌, విద్యుత్‌ వంటి సదుపాయాలను నాలుగు నెలలపాటు నిలిపివేయనుంది. ఈ మేరకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని ఫెడరల్ కేబినెట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

నవాజ్‌ షరీఫ్ లండన్ ఆస్పత్రి నుంచి వైద్య నివేదికలు సమర్పించకుండా బెయిల్ నిబంధనలు ఉల్లఘించిన కారణంగా ఆయన్ను పరారీలో ఉన్న నిందితుడిగా పరిగణిస్తున్నట్లు పాక్‌ ప్రధాని కార్యాలయ అధికారి తెలిపారు. ఇప్పటికే ఇస్లామాబాద్‌ హైకోర్టు పలు దఫాలుగా వైద్య నివేదికలు సమర్పించాలని నవాజ్ షరీఫ్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు. వాటికి బదులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.

గత సంవత్సరం అక్టోబరు 29న ప్రత్యేక వైద్యం కోసం జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌ షరీఫ్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన మెరుగైన వైద్యం కోసం తన సోదరుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు షాబాజ్‌తో కలిసి నవంబరు 19న లండన్‌కు వెళ్లారు. ఆయన అక్కడేవో రాజకీయ ఎత్తులు వేస్తున్నట్టుగా ప్రభుత్వం అనుమానిస్తోంది!

Next Story