పాక్‌ ప్రధాని కుర్చీకి ఎసరు‌.. కారణం అదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 1:07 PM GMT
పాక్‌ ప్రధాని కుర్చీకి ఎసరు‌.. కారణం అదే..!

ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు తెలీక సతమతమవుతున్న ఇమ్రాన్‌కు ఆజాదీ మార్చ్ చుక్కలు చూపిస్తోంది. ఏకంగా ఇమ్రాన్ ఖాన్ పీఠానికే ఆజాదీ మార్చ్ ఎసరు పెట్టింది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోవాలని ఆజాదీ మార్చ్ డిమాండ్ చేసింది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇచ్చింది. డెడ్‌ లైన్ లోపు రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.

జమాతే ఉలేమా ఇస్లామ్ ఫజల్ పార్టీ అధినేత ఫజులూర్ రెహ్మాన్ నేతృత్వంలో ఆజాదీ మార్చ్ జరిగింది. అక్టోబర్ 27న సింధ్ రాష్ట్రంలో ఈ యాత్ర మొదలైంది. లాహోర్, గుజ్రన్వాలా మీదుగా దేశ రాజధాని ఇస్లామాబాద్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సింధ్, పంజాబ్, లాహోర్, కరాచీల నుంచి వేలాదిమంది ప్రజలు ఈ మహాయాత్రలో పాల్గొన్నారు. ఇస్లామాబాద్‌కు యాత్ర చేరుకున్న తర్వాత నగ రాన్ని దిగ్బంధించారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రిజైన్ చేసేంతవరకు నగరాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ఆజాదీ మార్చ్ చేపట్టారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇమ్రాన్ ఖానే కారణమని ఫజలూర్ రెహ్మాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఓ కీలుబొమ్మ అని, రిగ్గింగ్ చేసి గెలిచా రని విమర్శించారు. ఫజలూర్‌కు పాకిస్థాన్ విపక్షాలన్ని మద్ధతు ప్రకటించారు. పీపీపీ, పీఎంఎల్‌ఎన్, అవామీ నేషనల్ పార్టీల నాయకులు ఆజాదీ మార్చ్‌లో పాల్గొన్నారు. ఫజలూర్, బిలావల్ భుట్టో, షా బాజ్ షరీఫ్ తదితరులు కలసికట్టుగా పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.

మరోవైపు, ఆజాదీ మార్చ్‌ను రాజకీయ స్టంట్‌గా ఇమ్రాన్‌ఖాన్‌ కొట్టిపడేశారు. రాజీనామా చేయడానికి ఇమ్రాన్ ఖాన్ ససేమిరా అన్నారు. ఇస్లాం పేరు చెప్పి అధికారంలోకి రావాలనుకునే రోజులు పోయా యని చెప్పారు. ఫజలూర్‌స భారత ఏజెంటని ఆరోపించారు.

Next Story