ఇకపై ఓయో దృష్టి లాభార్జనపైనే
By Newsmeter.Network Published on 14 Jan 2020 11:23 AM ISTముఖ్యాంశాలు
- ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఓయో సేవలు
- భారత్, చైనా, యూరోప్, అమెరికా దేశాల్లో సేవలు
- గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక స్థానంకోసం ప్రయత్నాలు
- పది శాతం ఉద్యోగులను తొలగించిన ఓయో
- విస్తరణ తర్వాత విపరీతమైన పరిణామాలు
- అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న హోటళ్ల యాజమాన్యాలు
బెంగళూరు: ఓయో హోటల్స్ యాప్ సృష్టికర్త రితేష్ అగర్వాల్ ఈ యాప్ సక్సెస్ పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో లాభార్జనమీదే దృష్టి సారిస్తామని ఆయన అంటున్నారు. ఇప్పటివరకూ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ సామర్ధ్యాన్ని పెంచుకోవడంపైనే పూర్తిగా దృష్టి పెట్టామనీ, ఇప్పుడు వినియోగదారులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించగలుగుతున్నాం కనుక, ఇకపై లాభార్జనమీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెబుతున్నారు.
ఖర్చులను తట్టుకోవడానికి, మార్కెట్లో నిలబడడానికి ఓయో పదిశాతం మంది ఉద్యోగులను అంటే దాదాపు వెయ్యిమందికి పైగా ఉద్యోగులను వివిధ స్థాయిల్లో తొలగించిన తర్వాత ఆ సంస్థ వార్తల్లోకెక్కింది. వివిధ హోటళ్లు, విశ్రాంతి కేంద్రాలను ఒకే ఒక యాప్ పరిధిలోకి తీసుకురావడంద్వారా ఓయో అద్భుతమైన ఫలితాలు సాధించగలిగింది. అయితే ఓయో పనితీరువల్ల తమకు చాలా నష్టం కలుగుతోందంటూ హోటళ్ల యాజమాన్యాలు తీవ్రస్థాయిలో అంసతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
గడచిన రెండేళ్లుగా ఓయో తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారత్, చైనా, యూరోప్, అమెరికా దేశాల్లో కూడా విస్తృతస్థాయిలో చొచ్చుకుపోయే ప్రయత్నం చేసింది. ఈ నేపధ్యంలో స్థాయిని మించిన ఆస్తులను, భవంతులనుకూడా తక్కువ బడ్జెట్ లోనే ప్రొవైడ్ చేసే ప్రయత్నాలు కొంతవరకూ బెడిసికొట్టినట్టే చెప్పాలి.
కేవలం ఈ కారణంవల్ల ఇండియాలో, చైనాలో వివిధ హోటళ్ల యాజమాన్యాలు ఒక్కసారిగా ఓయోపై విముఖతను వ్యక్తం చేశాయి. ఇలా ఇష్టం వచ్చిన రీతిలో అతి తక్కువ ధరలకు కోట్ చేసుకుంటూ అకామడేషన్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తూ పోతే హోటల్ ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదం వాటిల్లో పరిస్థితులు తలెత్తుతాయని హాటళ్ల యాజమాన్యాలు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.