త్వరలో తెలుగు లోగిళ్లలోకి ఓవర్ ది టాప్ యాప్ ...!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Nov 2019 11:44 AM GMT
త్వరలో తెలుగు లోగిళ్లలోకి ఓవర్ ది టాప్ యాప్ ...!!

తెలుగు వ్యూయర్లకు ఓ టీ టీ (ఓవర్ ది టాప్) యాప్ లలో తెలుగు కంటెంట్ అంటేనే ఎక్కువ ఇష్టం. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ 5, నెట్ ఫ్లిక్స్ వంటి యాప్ లను ఓవర్ ది టాప్ లేక ఓటీటీ యాప్ లు అంటారు. ఈ యాప్ లలో సినిమాలు, సీరియళ్లు, డిబేట్లు, డ్రామాలు, సీరీస్ లు చూడొచ్చు. అయితే మిగతా వారి కన్నా తెలుగువారిలో లోకల్ కంటెంట్ కావాలన్న మక్కువ ఎక్కువ.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో హిందీ ఇంగ్లీషు కంటెంట్ కన్నా లోకల్ కంటెంట్ కే పెద్దపీట వేస్తారని కే పీ ఎం జీ ఇండియా మీడియా సంస్థ ఎంటర్టెయిన్ మెంట్ డివిజన్ హెడ్ గిరీశ్ మెనన్ చెబుతున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థల్లో తెలుగు కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల తెలుగు కంటెంట్ తయారీకి మంచి స్కోప్ ఉందని ఆయన వాదన. ఈ అవకాశాన్ని గుర్తంచిన అల్లు అరవింద్, మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వర రావు, నిమ్మగడ్డ ప్రసాద్ లు సౌత్ కంటెంట్ కోసం ఒక ఓటీటీ ప్లాట్ ఫారంను రూపొందించనున్నట్టు ప్రకటించారు. ఇక అమెజాన్, వయాకోం 18 లు కూడా తెలుగువాడికి వీడియో విందు భోజనం పెట్టేందుకు సిద్ధమౌతున్నారు.

ఎక్స్ క్లూజివ్ తెలుగు కంటెంట్ అవసరం చాలా ఉందన్న విషయాన్ని పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలను డైరెక్ట చేసిన తరుణ్ భాస్కర్ కూడా నొక్కి చెబుతున్నారు. అయిదేళ్ల క్రితం ఓటీటీ ఇండియాకి వచ్చినప్పుడు అదింత పాపులర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఓటీటీలో నిర్మాతలు, దర్శకులకు కూడా ఒక సదుపాయం ఉంది. తమ కంటెంట్ ను ఎంత మంది చూస్తూన్నారు, ఏ యే చోట్లలో ఉన్న వారు చూస్తున్నారు, వారికి ఏ భాగం నచ్చింది వంటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పైగా సినిమా ఫెయిలయితే నిర్మాతకు, దర్శకుడికి చెడ్డపేరు వస్తుంది. హీరో డిమాండ్ పడిపోతుంది. హీరోయిన్ గ్రాఫ్ రసాతలంలోకి వెళ్లిపోతుంది. కానీ అదే ఓటీటీ కంటెంట్ అయితే ఈ ప్రమాదం ఉండదు.

రానున్న రోజుల్లో తెలుగువారికి ఓటీటీ కంటెంట్ ను వండి వడ్డించేవారి సంఖ్య ఇబ్బడి ముబ్బడి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తక్కువ ఖర్చుతో లిటీ కంటెంట్ ను రూపొందించి విడుదల చేయవచ్చు. అంతే కాదు. థియేటర్లు దొరుకుతాయో లేదోనన్న బెంగ లేదు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో బేరసారాలు, బ్రతిమిలాడటాలు చేయనక్కర్లేదు. హాయిలో ఆన్ లైన్ లో ఇంటింటికీ, కాదు కాదు ... మొబైల్ మొబైల్ కీ చేరవచ్చు. చూసేవారు కూడా ఏకబిగిన మూడు గంటలు థియేటర్లో కూర్చోనవసరం లేదు. ఒక పావు గంట చూసి, దాన్ని పాజ్ చేసి, వేరే పనులు చేసుకుని, మళ్లీ కాసింత టైమ్ దొరకగానే రెస్యూమ్ చేసుకోవచ్చు. అలా తీరిక ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా చూసుకుంటూ కంప్లీట్ చేసేయొచ్చు. అందుకే రానున్న అయిదారేళ్లలో ఓటీటీయే ఇక వ్యూయింగ్ ఫ్యూచర్.

Next Story