ఆస్కార్స్ లో కొరియా కొంగొత్త చరిత్ర

By రాణి  Published on  11 Feb 2020 6:03 AM GMT
ఆస్కార్స్ లో కొరియా కొంగొత్త చరిత్ర

ముఖ్యాంశాలు

  • 92 ఏళ్లలో తొలి విదేశీ ఉత్తమ చిత్రం

కొరియన్ చిత్రం పారసైట్ ఆస్కర్స్ లో చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల ఆస్కర్ చరిత్రలో తొలిసారి ఒక విదేశీ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది..అందరూ అనుకున్నట్టుగానే పారసైట్ హవా కొనసాగింది. ఆదివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ లోని డోల్బీ థియేటర్ లో ఘనంగా జరిగాయి. దర్శకులు బాంగ్ జూన్ హూ నిర్మించిన పారసైట్ నాలుగు అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. అసలు దక్షిణ కొరియా ఒక ఆస్కర్ ను గెలుచుకోవడం కూడా ఇదే తొలిసారి.

ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లేలకు గాను ఈ అవార్డులను గెలుచుకుంది. విజయ దరహాసంతో బాంగ్ జూన్ హూ “ అంగుళం పొడవైన సబ్ టైటిల్స్ ని సహించడం నేర్చుకుంటే మీకు బోల్డన్ని ఉత్తమ చిత్రాలు దొరుకుతాయి” అని ప్రకటించారు. ముందుగా ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం అవార్డు ప్రకటించగానే “అమ్మయ్య... రావాల్సిన అవార్డు వచ్చేసింది. ఇక రిలాక్స్ అవొచ్చు” అనుకున్నాడట దర్శకుడు హూ. కానీ ఆ తరువాత వెల్లువలా అవార్డు మీద అవార్డు కొట్టుకొచ్చేయడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఈ అవార్డుల పంటతో ఆయన తనపై తాను అదుపును కోల్పోలేదు. ఆస్కర్ కమిటీ అనుమతిస్తే రంపం తెచ్చి ఈ అవార్డును మూడు ముక్కలు చేసి, తనతోపోటీ పడిన దర్శకులు టాడ్ ఫిలిప్, సామ్ మెండిస్ లతో షేర్ చేసుకుంటానని అతను ప్రకటించడం అందరి హృదయాలను దోచుకుంది.

నిజానికి పదకొండు నామినేషన్లు గెలుచుకున్న జోకర్ చిత్రం రెండు అవార్డులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ది ఐరిష్ మ్యాన్, 1917, వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు తలో పది అవార్డులకు నామినేట్ అయ్యాయి. కానీ 1917 మూడు అవార్డులు, వన్సపానె టైమ్ రెండు అవార్డులు, ఐరిష్ మ్యాన్ ఒక అవార్డు మాత్రమే గెలుచుకున్నాయి.

పారసైట్ చిత్రంలో కిమ్ కుటుంబం పేదది. పార్క్ కుటుంబం బాగా ధనికమైనది. ఎలాగోలా కిమ్ కుటుంబం పార్క్ కుటుంబంలోకి చొరబడుతుంది. వారిపై పరాన్నజీవిలా ఆధారపడి బతికేస్తుంది. ఈ కథనే దర్శకుడు హూ అత్యద్భుతంగా చిత్రించాడు. కొరియా నేపథ్యానికి చెందిన కథే అయినా ఇది సార్వజనీనమైనది కావడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది.

Next Story