ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

By సుభాష్  Published on  11 April 2020 6:53 PM IST
ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

కరోనా వైరస్‌ అంటేనే గజగజ వణికిపోవాల్సిన పరిస్థతి వచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా తమ తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ వైరస్‌ వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

అయితే కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీని సైతం నిలిపివేయగా, ప్రభుత్వం ప్రకటనతో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మందికి అవగాహన లేదు. ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు తప్ప.. తర్వాత జాగ్రత్తలు పాటించడం లేదు.

కాగా, కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి అతివేగంగా వ్యాపిస్తుందనే విషయం అందరిని తెలిసిందే. ఇక ఆహార ప్యాకింగ్‌ ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ వైరస్‌ ఉపరితలంపై ఎక్కువ సమయం జీవించి ఉండలేదు. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది.

Online Food Order1

నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అధ్యయనం ప్రకారం.. ఈ వైరస్‌ అట్టముక్కలపై దాదాపు 24 గంటలు, ప్లాస్టిక్‌, స్టీల్‌పై 72 గంటలు, గాలిలో అయితే కేవలం 3 గంటలు జీవిస్తుంది. అందుకే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే సమయంలో కూడా ఫుడ్‌ ప్యాకేజీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌ఐహెచ్‌ సూచిస్తోంది. ఎందుకంటే సాధారణ సమయాల్లో కాకుండా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది.

ఇక కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఫుడ్‌ డెలివరీ వారు కాంటాక్ట్‌ లెస్‌ డెలివరీ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. అంటే డెలివరీ సిబ్బంది తమ వినియోగదారులకు ఫుడ్‌ ప్యాకేజీలను నేరుగా వారి చేతికి అందించకుండా వారి ఇంటి బయటే ఉంచి వెళ్తారు. మరోవైపు వినియోగదారులు గ్లౌజులు ధరించి ఫుడ్‌ ప్యాకేజీని తీసుకుంటున్నారు.

Online Food Order2

ఫుడ్‌ ప్యాకేజీని తెరిచే ముందు శుభ్రపర్చాలి

ఇక ఫుడ్‌ అందించే డెలివరీ బాయ్స్‌ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ శిక్షణ వంటి భద్రతాపరమైన మార్గదర్శకాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుడ్‌ ప్యాకేజీని తెరిచే ముందు శుభ్రపర్చాలి. దాంట్లో ఉన్న పదార్థాన్ని సురక్షితమైన పాత్రలోకి తీసుకోవాలి. ఫుడ్‌ ప్యాకేజీని తాకిన తర్వాత మీ చేతులను 20 సెకన్ల పాటు శుభ్రపర్చుకోవాలి. అంతేకాదు మీరు భోజనం చేసే ముందు కూడా మైక్రోవేన్‌లో దాదాపు రెండు నిమిషాల పాటు వేడి చేయడం తప్పనిసరి. ఎక్కువగా బయటి పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. కానీ తప్పని పరిస్థితి అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం బారిన పడకుండా ఉండవచ్చు.

Next Story