సంచలన నిర్ణయం: ఒంగోలులో 14 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్.. కలెక్టర్ ఉత్తర్వులు
By సుభాష్ Published on 19 Jun 2020 9:01 AM GMTఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఒంగోలులో కేసుల సంఖ్య తీవ్రం కావడంతో మళ్లీ కంటైన్‌మెంట్ జోన్ నిబంధనలు కఠినతరం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో నిర్బంధం ఒక్కటే మార్గమని భావించిన అధికారులు.. మళ్లీ లాక్‌డౌన్ విధించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలులో నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్ గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెండు నెలలపాటు కఠినంగా లాక్‌డౌన్ చేయడంతో కేసుల సంఖ్య తగ్గిపోయాయి. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. బుధవారం అత్యధికంగా 24 కేసులు నమోదు కాగా, గురువారం రికార్డు స్థాయిలో 38 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒక్క చీరాల పట్టణంలో 16 కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.ప ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 268 కేసులకు చేరుకుంది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 17609 కరోనా పరీక్షలు నిర్వహించగా, 465 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 376 కేసులు రాష్ట్రానికి సంబంధించినవి కాగా, మిగతవి ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చినవి ఉన్నాయి. తాజాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసులు 6961 నమోదయ్యాయి.