యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించి.. అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయి.. ఆత‌ర్వాత డైరెక్ట‌ర్‌గా కూడా స‌క్స‌స్ అయ్యాడు ఓంకార్. హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది సినిమాని తెర‌కెక్కించి ఘ‌న విజ‌యం సాధించారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో రాజు గారి గ‌ది 2 చిత్రాన్ని నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన తారాగ‌ణంగా ఓంకార్ తెర‌కెక్కించారు. అయితే… ఆ సినిమా ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఓంకార్ తాజాగా తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది 3. ఇందులో అశ్విన్ బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ఓంకార్ ఇక రాజు గారి గ‌ది సీక్వెల్స్ తీయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ట‌. స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డం ఓ కార‌ణ‌మైతే… ఈ సీక్వెల్స్ తీయ‌డానికి స‌రిపోయే క‌థను ఓంకార్ రాసుకోలేక‌పోతున్నారు.

అందుక‌నే ఇక రాజు గారి గ‌ది సీక్వెల్స్ తీయ‌కూడ‌దు. తీసి ఉన్న పేరు పొగొట్టుకోకూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే కనుక నిజ‌మైతే.. తెలివైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే. మ‌రి.. త‌దుప‌రి చిత్రానికి ఏ త‌ర‌హా క‌థాంశాన్ని ఎంచుకుంటాడో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.