ఒలింపిక్స్ వాయిదా.. మ‌ర‌లా ఎప్పుడంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2020 5:25 AM GMT
ఒలింపిక్స్ వాయిదా.. మ‌ర‌లా ఎప్పుడంటే..

వ‌చ్చే జూలై నుండి జ‌పాన్ వేధిక‌గా జ‌ర‌గ‌నున్న ఒలింపిక్ క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేయనున్న‌ట్లు ఒలింపిక్ క‌మిటీ అంత‌ర్జాతీయ స‌భ్యుడు డిక్ పౌండ్ తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంబిస్తున్న‌ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

బ్రిటీష్ ఒలింపిక్ సంఘం.. టోక్యో క్రీడ‌ల‌కు త‌మ అథ్లెట్ల‌ను పంప‌డం లేద‌ని తేల్చి చెప్పడంతో ఐఓసీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌ ఆస్ట్రేలియా, కెన‌డా దేశాలు ఇప్ప‌టికే త‌మ అథ్లెట్ల‌ను పంప‌వ‌ద్దని నిర్ణ‌యించాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న‌ స‌మాచారం మేర‌కు.. ఒలింపిక్స్‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఐఓసీ స‌భ్యుడు డిక్ పౌండ్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. ఎట్టి ప‌రిస్థితుల్లో జూలై 24వ తేదీన క్రీడ‌లు ఆరంభం కావ‌డంలేద‌న్నారు. ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌పై ఐఓసీకి నాలుగు వారాల గ‌డువు ఇచ్చినా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వాయిదా నిర్ణ‌యం త‌ప్ప‌ద‌ని పౌండ్ తెలిపారు. వాయిదా త‌ప్ప‌ని స‌రైతే.. 2021లో ఈ క్రీడ‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదే విష‌య‌మై జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా అనివార్యం కావొచ్చని అన్నారు. సోమవారం జపాన్‌ పార్లమెంట్‌లో ఒలంపిక్స్ నిర్వహణపై ఆయన మాట్లాడారు. క్రీడ‌ల నిర్వ‌హ‌ణ ప‌ట్ల‌ జపాన్‌ పూర్తి నిబద్ధతతో ఉందని.. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఆలస్యంగా నిర్వహించడం అనివార్యమవుతుందని అన్నారు. అందుకే వాయిదా వేయాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చని... అయితే రద్దు చేసే ఆలోచ‌న మాత్రం లేద‌ని అన్నారు.

Next Story