లాక్‌డౌన్‌ ముగిసింది.. సెలెబ్రేట్ చేసుకుందామని వెళ్ళిన యువతి ఏమైందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2020 10:15 AM GMT
లాక్‌డౌన్‌ ముగిసింది.. సెలెబ్రేట్ చేసుకుందామని వెళ్ళిన యువతి ఏమైందంటే..!

లాక్ డౌన్.. మన దేశంలోనే కాదు. కరోనా మహమ్మారి ప్రబలిన ప్రతి ఒక్క దేశం లోనూ అవలంబిస్తున్న విధానం. కొన్ని దేశాల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. దీంతో ఆయా దేశాల్లో లాక్ డౌన్ ను సడలిస్తూ వస్తున్నారు. చాలా రోజులుగా ఇళ్లకే పరిమితమైన వాళ్ళకు లాక్ డౌన్ ఎత్తివేయగానే పెద్ద రిలీఫ్ గా అనిపించింది. దీంతో కొందరు లాక్ డౌన్ ముగియడాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలా వెళ్లిన ఓ యువతి ప్రాణాలను కోల్పోయింది.

ఈ ఘటన టర్కీలో చోటుచేసుకుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇటీవలే లాక్ డౌన్ ను ఎత్తివేశారు. దీంతో కజకిస్థాన్ కు చెందిన ఒలేస్యా సుస్పిత్స్యానా తన స్నేహితురాలితో కలిసి ప్రముఖ టూరిస్ట్ ప్రదేశమైన ఆంటాల్యా కు వెళ్ళింది. అక్కడ ఆమె 115 అడుగుల ఎత్తు ఉన్న కొండ అంచు నుండి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.

31 సంవత్సరాల ఒలేస్యా లాక్ డౌన్ ఎత్తి వేయడంతో తన స్నేహితురాలితో కలిసి ఆంటాల్యా లోని వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ కొండ అంచున నిలబడి ఓ ఫోటో తీయించుకోవాలని అనుకుంది. వెనకాల వాటర్ ఫాల్స్ బాగా కనిపించాలంటూ అంచు వరకూ వెళ్ళిపోయింది. అక్కడ ఉంచిన సేఫ్టీ ఫెన్స్ ను కూడా దాటుకుని వెళ్ళిపోయి మరీ అంచుల్లో నిలబడి తన స్నేహితురాలిని ఫోటో తీయమని కోరింది. ప్రామాదకరమైన ప్రాంతమైనా కూడా ఆమె లెక్కచేయకుండా నిలబడింది. అలా ఫోటో తీయించుకునే క్రమంలో అక్కడ ఉన్న గడ్డి మీద కాలు జారడంతో 115 అడుగుల(35మీటర్లు) పైన నుండి కింద పడి మరణించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు కూడా ధృవీకరించారు.

Next Story