పాత పధ్ధతిలో పాత భవంతికి కొత్త అందాలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 7:23 AM GMTచెన్నై మహానగరంలోని చేపాక్... చేపాక్ లో చేపాక్ ప్యాలెస్... అందులో హుమాయూన్ మహల్.... దాదాపు 250 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. అయితే హుమాయూన్ మహల్ పెచ్చులూడుతున్నాయి. గోడలు బలహీనమౌతున్నాయి. ఈ చారిత్రిక కట్టడానికి ఇప్పుడు రిపేర్లు అత్యవసరం.
కొత్త తరం సిమెంట్ వేసినా, ఆధునిక ఆర్కిటెక్చర్ పద్ధతులు వాడినా బిల్డింగ్ అందం పాడైపోతుంది. అంతే కాదు. అసలుకే ఎసరొచ్చి భవనం మరింత దెబ్బతింటుంది. కాబట్టి ఏం చేయాలి? తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ముందు ఈ ప్రశ్న వచ్చిపడింది. దాంతో వారు దేశ విదేశాల్లోని నిపుణులను సంప్రదించారు. ఆర్కియాలజీ విభాగాన్ని అడిగారు. చివరికి వారు అలనాటి భవన నిర్మాణ శైలినే ఆశ్రయించారు. అప్పటి పద్ధతితోనే పని చేయాలని నిర్ణయించారు.
పాత కాలం గుల్ల సున్నం తోమరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. పాత తరం సున్నం బండల కింద వేసి బాగా నలిపి తయారు చేస్తారు. ఇలా నిదానంగా, రోజుల తరబడి తిరగాలి. అప్పుడే ఆ సున్నం గట్టిగా పట్టుకుంటుంది. దీనిలో నీరు కలిపి చక్కని సున్నం పేస్టు తయారవుతుంది. ఇందుకోసం బరువైన రాయి కావాలి. రాయిని తిరగలిలా తిప్పేందుకు బలమైన ఎడ్లు కావాలి. దాంతో అధికారులు బండరాయి కోసం, తిరగలి చోటు కోసం, ఎడ్లకోసం వెతుకులాట మొదలుపెట్టారు.
గాంగేయం జాతి ఎడ్లను ఎలాగోలా సంపాదించారు. కణ్ణన్ అనే రైతు నుంచి అద్దెకు తీసుకువచ్చారు.ఇక అయిదు టన్నుల బరువున్న తిరగలి రాయిని వెల్లూర్ జిల్లాలోని షోలింగర్ నుంచి తెచ్చారు. సున్నాన్ని వేసి తిప్పేందుకు 25 అడుగుల వెడల్పైన రాయి చెన్నైకి 70 కిమీ దూరంలో ఉన్న మహాబలిపురంలో కనిపించింది. ఈ రాయిని, సున్నాన్ని, ఎడ్లని అక్కడికి తరలించారు. ఇలాంటి పెద్ద పెద్ద గానుగల్లాంటివి ఎక్కడున్నాయో వెతికారు. తిరునల్వేలి లోని కలంగుమలై గుడిలో ఒకటి దొరికింది. ఇంకొకటి తూత్తుకుడిలోని చర్చిలో దొరికింది. వాటిని పరిశీలించి చూశారు. కాస్త ట్రయల్స్ వేశారు. ఆ తరువాత ఒక మూడు లక్షలు ఖర్చుపెట్టి మొగలుల నాటి తయారీ విధానాన్ని మళ్లీ ప్రారంభించి, పనిచేయించారు. ఇప్పుడు చరిత్రాత్మక హుమాయూన్ మహల్ మళ్లీ కొత్త అందాలు సంతరించుకుంది. పాత భవనానికి పాత మరమ్మత్తు శైలిని ఉపయోగించడం వల్ల మొత్తం మీద కొత్త అందాలు వచ్చాయి.