తోటి కోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కి మహిళ నిరసన
తోటి కోడలు తిట్టిందని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 2:18 PM GMTతోటి కోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కి మహిళ నిరసన
ప్రకాశం జిల్లాలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. తోటి కోడలు తిట్టిందని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. ఆమె సెల్ టవర్ ఎక్కడంతో కాసేపు కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు.
ప్రకాశం జిల్లాలోని కంభంలో మంగళవారం చోటు చేసుకుంది ఈ సంఘటన. తోటి కోడలితో తగాదా నేపథ్యంలో లక్ష్మీభాయి అనే మహిళ కందలాపురం కూడలిలోని సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...
అర్ధవీడు మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన తోడికోడళ్లు లక్ష్మీభాయి, శ్రావణిబాయి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన గొడవ పెద్దది అయ్యింది. ఇద్దరూ బాగా తిట్టుకున్నారు. ఈ క్రమంలోనే శ్రావణి భాయి తనను తిట్టిందంటూ గొడవ పెట్టుకుని హింసిస్తుందంటూ.. లక్ష్మీభాయి అర్ధవీడు పోలీసులను ఆశ్రయించింది. శ్రావణిపై ఫిర్యాదు చేసింది. మరోవైపు శ్రావణిభాయి కూడా పెద్దారవీడులో లక్ష్మీభాయిపై కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పెద్దారవీడు పోలీసులు లక్ష్మీభాయికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిచారు. అయితే పోలీసులు పిలవడంతో లక్ష్మీభాయి మనస్తాపానికి గురైంది. అవమానంగా ఫీలయ్యింది. దాంతో కంభానికి వచ్చిన లక్ష్మీభాయి సెల్‌టవర్ ఎక్కింది. తోడి కోడలే గొడవపెట్టుకుని అన్యాయంగా కేసు పెట్టిందని.. పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించింది.
మహిళ సెల్‌టవర్ ఎక్కిందన్న విషయం తెలుసుకున్న సీఐ రాజేశ్‌కుమార్ ఘటనాస్థలికి వెళ్లారు. ఆమెను కిందకు దిగాలని విన్నవించారు. విచారణ జరిపిస్తామని న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో సదురు మహిళ కిందకు దిగింది. చివరకు ఇద్దరినీ పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా.. మహిళ అలా తోటికోడలితో గొడవ కారణంగా హల్‌చల్ చేసిన వార్త స్థానికంగా కలకలం రేపింది.