ఆ ఫ్యామిలీలో అందరి బర్త్‌డే ఒకే రోజు.. గిన్నిస్ రికార్డు నమోదు
పాకిస్థాన్‌లోని లర్కానాకు చెందిన అమీర్, ఖుదీజాలకు ఆగస్టు 1 అంటే ఎంతో ప్రత్యేకం.
By Srikanth Gundamalla Published on 12 July 2023 4:56 PM ISTఆ ఫ్యామిలీలో అందరి బర్త్‌డే ఒకే రోజు.. గిన్నిస్ రికార్డు నమోదు
ప్రపంచంలో ఎంతో వింత ఘటనలు జరుగుతుంటాయి. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేకపోవడంతో ఇలాంటి పెద్దగా బయటకు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ప్రపంచం నలుములల్లో ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఇప్పటి వరకు అలాంటి వింతలు విశేషాలు చాలా చూసిఉంటాం. కానీ.. పాకిస్థాన్‌లో మాత్రం ఎవరూ ఊహించని ఓ వింత ఉంది. ఒక ఫ్యామిలీలో ఉన్న 9 మంది పుట్టిన రోజులు ఒకేరోజు కావడం. నిజం కాదని కొట్టిపారేయొద్దు ఎందుకంటే వరల్డ్ గన్నీస్ బుక్ కూడా ధృవీకరించి వీరికి అధికారిక పత్రాన్ని అందజేసింది.
ఒకే కుటుంబంలో కవలలు పుడితే.. లేదంటే పుట్టిన పిల్లల బర్త్‌డేలు ఒకేరోజు ఉంటే ఎంతో సంబరంగా ఉంటుంది కదా. అలాంటిది ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యుల అందరి పుట్టిన రోజు ఒకే రోజు అయితే.. ఇది వండర్. పాకిస్తాన్‌లోని ఓ కుటుంబంలో జరిగింది ఈ అద్భుతం.
పాకిస్థాన్‌లోని లర్కానాకు చెందిన అమీర్, ఖుదీజాలకు ఆగస్టు 1 అంటే ఎంతో ప్రత్యేకం. నిజానికి ఈ తేదీ చుట్టే వీరి జీవితం తిరిగిందని చెప్పాలేమో. వీరి ఇంట్లో మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ జంట 1991లో తమ పుట్టిన రోజు నాడే పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత 1992లో ఆగస్టు 1వ తేదీనే మొదటి పాప పుట్టింది. ఇదంతా యాదృచ్ఛికంగానే భావించారు.. అయినా పాప బర్త్‌డే.. తమ పెళ్లి రోజుతో పాటు.. వారి పుట్టినరోజులు ఒక్కటి కావడంతో సంతోషపడ్డారు. ఇక ఆ తర్వాత వరుసగా జన్మించిన ఆరు మంది పిల్లలు కూడా ఆగస్టు 1వ తేదీనే జన్మించారు. పెద్ద కూతురు పేరు సింధు, తర్వాత వరుసగా సుసాయి-సప్నా, అమిర్-అంబర్, అమయ్మర్-అహ్మర్ అనే కవలలకు ఆగస్టు 1వ తేదీనే జన్మనిచ్చారు. తద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఒకేరోజు జన్మించిన అత్యధిక కవల తోబుట్టువుల రికార్డు కూడా వీరే సొంతం చేసుకున్నారు. ఇక ఆగస్టు 1 వచ్చిందంటే చాలు అమీర్ ఇంట్లో సంబరాలు మిన్నంటుతున్నాయి.
దీనిపై అమీర్ మాట్లాడుతూ.. పిల్లలు ఒకేరోజున పుట్టాలని ప్లాన్ చేయలేదని చెప్పాడు. అదంతా సహజంగానే జరిగిపోయిందని తెలిపాడు. ఇక తన భార్య ఖుదీజా బర్త్‌డే, తమ పెళ్లి రోజు కూడా యాదృచ్చికంగా కుదిరిందని చెప్పాడు. ఆగస్టు 1వ తేదీన ఇంట్లో మొత్తం 9 మంది కలిసి ఒకేసారి కేక్ కట్ చేస్తున్నామని అమీర్ అన్నాడు. ఇక ప్రపంచ రికార్డు సాధించడం కూడా ఎంతో ఆనందంగా ఉందని అమీర్ కుటుంబం చెబుతోంది. వీళ్లు రికార్డు సాధించడం పట్ల బంధువులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి అరుదైన విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.