పాలు తాగుతోన్న నంది విగ్రహం.. క్యూ కడుతున్న భక్తులు
ఓ గుడిలో ఉన్న నంది విగ్రహం పాలు, నీళ్లు, కొబ్బరినీళ్లు తాగుతోందని చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 11:05 AM GMTపాలు తాగుతోన్న నంది విగ్రహం.. క్యూ కడుతున్న భక్తులు
ప్రతిచోట రోజూ ఏదో ఒక వింత సంఘటన జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేకపోవడంతో పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. ప్రపంచం నలుములలా ఏం జరిగినా క్షణాల్లో చేతుల్లోకి వచ్చేస్తుంది. అదే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. నిజామాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ గుడిలో ఉన్న నంది విగ్రహం పాలు, నీళ్లు, కొబ్బరినీళ్లు తాగుతోందని చెబుతున్నారు. దాంతో.. భక్తులు ఈ విచిత్రాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక మహాదేవుని ఆలయంలో నందీశ్వరుడి ఆలయం ఉంది. నంది విగ్రహం పాలు తాగుతుందని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింతను చూసేందుకు కమ్మరపల్లి మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా ఈ ఆలయానికి క్యూ కడుతున్నారు. కొందరు విగ్రహం పాలు తాగుతున్న సంఘటననునమ్మడం లేదు. నిజమేనా అని రుజువు చేసుకునేందుకు ఆలయానికి వచ్చి.. విగ్రహం పాలు, నీళ్లు తాగడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. నందీశ్వరుడు పాలు, నీళ్లు తాగడం పరమశివుడి లీలేనంటూ భక్తులు ప్రచారం చేస్తున్నారు. ఆలయానికి వెళ్లిన ప్రతీ భక్తుడు శివుడిని దర్శించుకుని.. నంది విగ్రహానికి పాలు, నీళ్లు, కొబ్బరినీళ్లు తాపుతున్నారు.
నంది విగ్రహం పాలు తాగడంపై శాస్త్రవేత్తలు మరో మాట చెబుతున్నారు. దేవుడి మహిమ లేదని.. దీనికీ సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు. ఒక స్పాంజ్‌ని తీసుకుని నీళ్లలో పెడితే ఎలా అయితే నీళ్లు పీల్చుకుంటుందో.. అలానే విగ్రహం విషయంలో కూడా జరిగిందని ఉదాహరణగా చెబతున్నారు. కొన్ని రాత్రి విగ్రహాలు, ఇసుకరాయి లేదా మట్టితో తయారైన దేవుడి ప్రతిమలకు కొంతైనా నీటిని పీల్చుకునే గుణం ఉంటుందని చెబుతున్నారు. అలాంటప్పుడు స్పూన్‌తో కొంత మొత్తం నీళ్లను విగ్రహం దగ్గర పెడితే అది పీల్చుకుంటుందని అంటున్నారు. అంతేకాని.. విగ్రహానికి దేవుడి మహిమ అలాంటివి ఏమీ ఉండవంటున్నారు. ఈ ప్రక్రియను సర్ఫేస్ టెన్షన్ అని అంటారని వివరిస్తున్నారు.
— GSREDDY (@GSreddymedia) July 24, 2023