మంగళగిరి ఆలయ కోనేరు పూడికతీతలో బయటపడ్డ విలువైన పురాతన వస్తువులు
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పెద కోనేరులో పూడికతీతలో అధికారులు విలువైన అతి పురాతన వస్తువులను కనుగొన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 1:59 PM ISTమంగళగిరి ఆలయ కోనేరు పూడికతీతలో బయటపడ్డ విలువైన పురాతన వస్తువులు
గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పెద కోనేరులో పూడికతీత పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే.. ఈ పూడికతీతలో అధికారులు విలువైన అతి పురాతన వస్తువులను కనుగొన్నారు. 152 అడుగుల వరకు పూడికతీత కొనసాగినట్లు అధికారులు చెప్పారు. ఆరు నెలల పాటు ఈ పనులు కొనసాగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ అతిపురాతన వస్తువులు బయటపడ్డాయి. పురాతన కాలం నాటి రాగి, బంగారు చెంబులు, గ్లాసులు, కొన్ని దేవుడి ప్రతిమలు, నాణాలు బయటపడ్డాయి. బయటపడ్డ వస్తువుల్లో కొన్నింటిని జర్మనీలో తయారు చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పూడికతీతలో దొరికిన వస్తువులను దేవాలయ అధికారులకే అప్పగించారు.
మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని పెద కోనేరు అద్భుత నిర్మాణమని చెబుతున్నారు. దీన్ని దాదాపు 800 ఏళ్ల క్రితం నిర్మించినట్లు వివరిస్తున్నారు. పై నుంచి చక్రం ఆకారంలో, కింద నుంచి శంఖం ఆకారంలో కనిపించేలా కోనేరు నిర్మాణం ఉంటుంది. కోనేరు పూడికతీత పనుల్లో ఆంజనేయ స్వామి ఆలయం కూడా బయటపడింది. ఆ తర్వాత మెట్లపై చెక్కిన రెండు శివలింగాలు, గణపతి విగ్రహం, హనుమంతుడి మరో విగ్రహం కూడా బయటకు వచ్చాయి. కోనేరులో సొరంగ మార్గం మరో అద్భుతమని అధికారులు చెబుతున్నారు. ఎంతో విశిష్టత ఉన్న కోనేరు చరిత్ర కాలక్రమేణా పోకూడదనే అధికారులు పూడికతీత పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ కోనేరుని కాపాడుకునేందుకు ముందుంటామని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఆలయ నిపుణుల కమిటీ సూచించిన మేరకు అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. కోనేరుని పూర్తిగా అభివృద్ధి చేశాక భక్తుల సందర్శనకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. గతంలో తెప్పోత్సం నిర్వహించేవారని.. కానీ ఇప్పుడు పూడికతీత పనులు కొనసాగుతున్న సందర్భంగా తెప్పోత్సవానికి అవకాశం లేదన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. పూడికతీత పనులు, అభివృద్ధి పనులు పూర్తయ్యాకే తెప్పోత్సవం కూడా నిర్వహిస్తామని చెప్పారు. మరో రెండు మూడు నెలల్లోనే అన్ని పనులను పూర్తి భక్తుల సందర్శనకు కోనేరుని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. చరిత్రను కనుమరుగు అవ్వనివ్వొద్దని.. ముందు తరాలకు అందించాలని ఈ సందర్భంగా చెప్పారు.
మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. దేశంలోని శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన 8 పవిత్ర స్థలాల్లో ఈ ఆలయం ఒకటిగా చెబుతుంటారు. అష్ట మహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా పేర్కొంటారు. కొండపైన.. దిగువన మూడు దేవాలయాలు ఉన్నాయి. ఇండియాలోనే ఎత్తైన గోపురం కలిగిన దేవాలయాల్లో మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయం ఒకటి. దీని గోపురం సుమారు 153 ఎత్తులో ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించేవారని తెలుస్తోంది.