డయాబెటిస్ ఉందని మహిళను విమానం నుంచి దించేసిన సిబ్బంది
ఓ మహిళ డయాబెటిస్‌తో బాధపడుతున్నది అనే కారణంతో విమానం నుంచి కిందకు దించేశారు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 3:54 PM ISTడయాబెటిస్ ఉందని మహిళను విమానం నుంచి దించేసిన సిబ్బంది
ఓ మహిళ డయాబెటిస్‌తో బాధపడుతున్నది అనే కారణంతో విమానం నుంచి కిందకు దించేశారు. యూకేలోని న్యూకేజిల్ ఎయిర్‌పోర్టులో అక్టోబర్ 2వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బ్రిటన్‌కు చెందిన మహిళ హేలన్ టేలర్ తన భర్తతో కలిసి రోమ్ వెళ్లేందుకు యూకేలోని న్యూకేజిల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. జెట్2 విమానానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన భార్యాభర్తలు ఇద్దరూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లి.. ఆ తర్వాత విమానం కూడా ఎక్కారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న టేలర్ విమానంలో కాస్త అసౌకర్యంగా కనిపించారు. దాంతో.. క్యాబిన్ సిబ్బంది ఆమెను కిందకు దించేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మహహిళను బలవంతంగా విమానం సిబ్బంది కిందకు దించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హేలన్ టేలర్ విమానం ఎక్కాక టాయిలెట్‌కు వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో చెమలు పట్టి.. అలసిపోయినట్లుగా కనిపంచింది. దాంతో.. సిబ్బంది ఆమె దగ్గరకు వచ్చి ఆరా తీశారు. అందుకు తనకు టైప్-2 మధుమేహం ఉందని తెలిపింది. అంతేకాకుండా రోజంతా ఆహారం తీసుకోలేదని.. విమానం ఎక్కిన తర్వాత తిన్నానని విమాన సిబ్బందితో చెప్పింది టేలర్. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని మాత్రమే పెంచుతుంది.. కూర్చుని నీరు తాగితే సర్దుకుంటుందని చెప్పింది. వైద్య సాయం తీసుకుంటారా అంటూ సిబ్బంది ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పింది టేలర్. తనకేం కాలేదని.. అంతా బాగానే ఉందని కూడా చెప్పింది. కానీ.. 10 నిమిషాలకే మరోసారి వచ్చిన విమాన సిబ్బంది ఆమెను విమానంలో నుంచి కిందకు దించేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. టేలర్ తనకు ఇప్పుడు బాగానే ఉంది.. సెట్ అయ్యానని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే దించేశారు. వద్దని చెప్పినా వినకుండా విమాన సిబ్బంది బలవంతంగా దించారంటూ టేలర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై జెట్2 విమానయాన సంస్థ మరోలా స్పందించింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యం అని స్పష్టం చేసింది. వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఏది ఏమైనా దీనిపై లోతైన విచారణ జరిపిస్తామని తెలిపింది సంస్థ. ఆమెకు క్షమాపణలు చెప్పడానికి.. టికెట్ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెట్2 విమానయాన సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. సాధారణంగా ప్రయాణికుల ఆరోగ్యం ప్రమాదంలో ఉందనిపిస్తే వారిని విమాన ప్రయాణానికి అనుమతించరు.