దుబాయ్‌లో లక్కీడ్రా.. తెలుగోడిని వరించిన లక్‌.. రూ.2.25 కోట్లు

By Srikanth Gundamalla  Published on  26 Jun 2024 8:45 AM IST
dubai, lucky draw, andhra man, winner,  rs. 2.25 crore,

దుబాయ్‌లో లక్కీడ్రా.. తెలుగోడిని వరించిన లక్‌.. రూ.2.25 కోట్లు

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. ఉన్నట్లుండి కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. తాజాగా దుబాయ్‌లో మన తెలుగోడిని అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ఏకంగా 2.25 కోట్ల రూపాయలను దక్కించుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరుగడ్డ నాగేంద్రం అనే వ్యక్తి 2017లో ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులను ఏపీలో ఉన్న కుటుంబం పోషణ కోసం వినియోగించసాగాడు. అయితే.. 2019 నుంచి తాను సంపాదించిన దాంట్లో కొంత డబ్బుని ప్రతి నెలా 100 యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ను నేషనల్ బాండ్స్‌లో పొడుపు చేశాడు. ఇందులో సేవింగ్స్ చేసేవారికి రివార్డు ప్రోగ్రామ్ కింద లక్కీ డ్రా తీస్తారు. అయితే.. ఇటీవల లక్కీ డ్రా తీయగా అదృష్టం నాగేంద్రంను వరించింది. లక్కీడ్రాను విజేతగా నిలిచి భారీ మొత్తంలో డబ్బును గెలుచుకున్నాడు.

గ్రాండ్‌ ప్రైజ్‌ మనీ కేటగిరీ కింద తీసిన లాటరీలో నాగేంద్ర విన్నర్‌గా నిలబడ్డాడు. నగదు బహుమతి కింద నాగేంద్రంకు ఒక మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ను అందించారు నిర్వాహకులు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2.25 కోట్లు పైగా అన్నమాట. అయితే.. పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ గెలచుకున్న నాగేంద్రం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ డబ్బుని తన పిల్లల చదువు, భవిష్యత్‌ కోసం ఉపయోగిస్తానని చెబుతున్నాడు. ఇక తెలుగోడు దుబాయ్‌లో అదృష్టం ద్వారా డబ్బులు గెలుచుకోవడంతో నెటిజన్లు, తెలుగువారు అభినందనలు తెలుపుతున్నారు.

Next Story