వరుడు తాగేసి పెళ్లికి లేట్‌గా వచ్చాడని.. మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు
వరుడు మద్యం సేవించి పెళ్లికి లేట్‌గా వచ్చాడని వధువు పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 7:00 PM ISTవరుడు తాగేసి పెళ్లికి లేట్‌గా వచ్చాడని.. మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు
పెళ్లి వేడుక అంటేనే ఎంతో హడావుడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకి అయితే అస్సలు టైమే ఉండదు. సాంప్రదాయ కార్యక్రమాలతో బిజీ అయిపోతారు. ఇక పెళ్లికి వచ్చిన బంధువులు కూడా పెళ్లి ఏర్పాట్ల పనుల్లో మునిగిపోతారు. పెళ్లి ముహూర్తం సమయానికి జరిగిపోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకు అనుగుణంగానే పనులు చకచకా చేస్తారు. కానీ.. బీహార్‌లో ఓ వింత సంఘటన జరిగింది. పెళ్లి కొడుకు వివాహ సమయానికి అందుబాటులో లేకుండా పోయాడు. ఎటువెళ్లిపోయాడు అని అందరూ వెతికారు. చివరకు అతను మద్యం మత్తులో అపస్మారక స్థితిలో కారులో కనిపించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న వధువు కోపం కట్టలు తెంచుకుంది. అతడితో జీవితాంతం ఎలా ముందుకు సాగాలా అని ఊహించుకుంది. వెంటనే వివాహాన్ని రద్దు చేసుకుంది.
బీహార్‌కు చెందిన వరుడు మంజిత్ చౌదరి, వధువు మనీషాకు వివాహం నిశ్చయించారు పెద్దలు. వరుడు మంజిత్ చౌదరి కుర్సేలలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా రావాలి. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు తమ స్టేటస్‌కి తగ్గట్లుగా గొప్పగా ఏర్పాట్లు చేశారు. అయితే.. ఊరేగింపునకు రావాల్సిన వరుడు కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. దాంతో వధువు బంధువులు తీవ్ర ఆగ్రహం చెందారు. చివరకు అపస్మారక స్థితిలో కారులో కనిపించాడు. పెళ్లి పీటలపైకి ఎలాగోలా తీసుకొచ్చినా.. అతడు మద్యం మత్తులో ఉన్నాడని వధువు గుర్తించింది. దాంతో.. ఆమె కూడా మండిపడింది.
మద్యం తాగి ఆలస్యంగా రావడం.. జీవితాంతం కలిసి ఎలా ముందుకు వెళ్తాననే భయంతో వధువు కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాన్ని రద్దు చేసుకుంది. దాంతో.. ఏర్పాట్ల కోసం తాము ఖర్చు పెట్టిన రూ.4 లక్షలు ఇవ్వాలని వధువు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దాంతో.. చేసేదేం లేక వరుడు తరఫు బంధువులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై మాట్లాడిన మంజిత్ చౌదరి.. తాను పెళ్లి మండపానికి వెళ్తున్న సమయంలో స్నేహితులు కారులో ఎక్కించి మత్తు పదార్థాలు ఇచ్చారని చెప్పాడు. తనకు తెలియకుండా తినేశానని అన్నాడు. మరోవైపు వధువు సోదరుడు మాట్లాడుతూ.. అతను అబద్ధాలు చెప్పాడనీ.. మద్యానికి బానిస అయ్యాడని ఆరోపించాడు. ఏది ఏమైనా వరుడు మద్యం సేవించి పెళ్లికి లేట్‌గా వచ్చాడని వధువు పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది.