60 ఏళ్ల వయసులో సీఈవో ఉద్యోగాన్ని వదిలి.. ట్రక్‌ డ్రైవర్‌గా చేస్తున్నాడు!

ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్‌ రాస్ సీఈవో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ట్రక్కు డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు.

By Srikanth Gundamalla  Published on  15 July 2023 6:16 AM GMT
Australia, Man Quits As CEO, Becomes Truck Driver,

 60 ఏళ్ల వయసులో సీఈవో ఉద్యోగాన్ని వదిలి.. ట్రక్‌ డ్రైవర్‌గా చేస్తున్నాడు!

ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్‌ రాస్ అనే వ్యక్తి సీఈవో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ట్రక్కు డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అదికూడా 60 ఏళ్ల వయసులో. సాధారణ జీవితం గడపాలనేది ఆయన ఆలోచన అట మరి.

ఓ సినిమాహాళ్ల సంస్థకు సీఈవోగా పనిచేశాడు గ్రెగ్‌ రాస్. అప్పటికే ఆయనకు 60 ఏళ్లు ఆ వయసులో ఎవరూ సాహోపేత నిర్ణయాలు తీసుకోవాలనుకోరు. పైగా మంచి జీతం. మంచి పొజిషన్. జనాల్లోకి వెళ్తే మర్యాద. ఇవన్నీ ఆయనకు నచ్చినట్లుగా లేవు. 60 ఏళ్ల వయసులో సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా వినకుండా రాజీనామా చేసి ట్రక్‌ డ్రైవర్‌గా చేరాడు. గత 12 ఏళ్లుగా ట్రక్ డ్రైవర్‌గానే పని చేస్తున్నాడు గ్రెగ్‌ రాస్. అసలు ఎందుకు అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు?

గ్రెగ్‌ రాస్‌ ముందు విలాసవంతమైన కార్లు విక్రయించే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. అప్పట్లోనే జీవితంలో ఏదో కోల్పోయానని గ్రెగ్‌ రాస్ అనుకున్నాడు. అలసత్వం మనసులో నాటుకుపోయింది. అప్పటికే పెళ్లి అవ్వడం.. పిల్లలు చిన్నవారు కావడంతో ఆలోచనలను అదుపులో పెట్టుకున్నాడు. అదే ఉద్యోగాన్ని కొనసాగించాడు. కాలక్రమేణా గ్రెగ్ రాస్ ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా ఎదిగారు. అయినా మనుసులో ఉన్న అసంతృప్తి అలాగే ఉంది. సాధారణ జీవితం గడపాలని.. ట్రక్‌ డ్రైవర్‌గా పని చేయాలని గ్రెగ్‌ రాస్‌కు ఇష్టమట. పెద్ద పెద్ద ట్రక్‌లను నడుపుతున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు అంటే ఇష్టం గ్రెగ్‌ రాస్‌కి. అయితే.. సీఈవోగా పని చేస్తున్న సమయంలో 60 ఏళ్లు. పిల్లలు పెద్దవారు అయిపోయారు. ఎవరి లైఫ్‌ని వారు లీడ్‌ చేస్తున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు గ్రెగ్. ఇంట్లో తన మనుసులో ఉన్న మాట చెప్పాడు. ట్రక్‌ డ్రైవర్‌గా పని చేస్తానని వాదించాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా వినలేదు. ఆ ఏజ్‌లో రెస్ట్‌ తీసుకోవాలని సూచించినా మనసు ఒప్పుకోలేదు. చివరకు సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు గ్రెగ్ రాస్.

గ్రెగ్‌ పంపిన రెజ్యూమ్‌లో గతంలో పని చేసిన అనుభవం గురించి రాయలేదు. దాంతో.. గ్రెగ్‌ను సదురు కంపెనీ పిలిచి ప్రశ్నించగా జరిగిందంతా చెప్పాడు. అది విన్న సదురు కంపెనీ ఉద్యోగులు షాక్‌ అయ్యారు. ఆయన మనసులో ఉన్న కోరికను వారు కూడా కాదనలేక పోయారు. అయితే.. రాత్రిళ్లు మాత్రమే ట్రక్‌ నడిపేందుకు అవకాశం కల్పించారు. దాంతో తనకు నచ్చిన ట్రక్‌ డ్రైవర్‌ ఉద్యోగంలో చేరాడు గ్రెగ్ రాస్. కొన్నాళ్లు రాత్రుళ్లు పని చేసి.. ఇప్పుడు పగటి పూట కూడా ట్రక్‌ నడుపుతున్నాడు. గ్రెగ్‌కు ప్రస్తుం 72 ఏళ్లు. రాబోయే రోజుల్లో అతిపెద్ద ట్రక్కులు.. 482 టన్నుల బరువు మోసుకెళ్లగలిగే ట్రక్కుని నడపడే తన లక్ష్యమని చెబుతున్నాడు.

గ్రెగ్‌ రాస్‌కు 20 ఏళ్ల క్రితం థైరాయిడ్‌ క్యాన్సర్‌ వచ్చింది. 3 నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ.. గ్రెగ్‌ సంకల్పం ముందు ఆ వ్యాధి ఓడిపోయింది. చికిత్స పొందిన తర్వాత కోలుకుని మళ్లీ జీవితంలో కష్టపడి పనిచేశారు. అలా ఎన్నో పదవులు చేసి.. క్యాన్సర్‌ను జయించి 70 ఏళ్ల వయసులోనూ ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తోన్న గ్రెగ్‌ రాస్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటున్నారు నెటిజన్లు.

Next Story