తల్లి శునకం ఆవేదన..అర్థం చేసుకుని పిల్లలను కాపాడిన పోలీసులు
తల్లి శునకం మూగ ఆవేదనను అర్థం చేసుకున్నారు పోలీసులు. వరదలో ఓ ఇంట్లో చిక్కుకున్న పిల్లలను తల్లి చెంతకు చేర్చారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 8:48 AM GMTతల్లి శునకం ఆవేదన..అర్థం చేసుకుని పిల్లలను కాపాడిన పోలీసులు
తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదు. మనుషులైనా.. మూగ జీవాలైనా తల్లికి తన సంతానమే ప్రాణం. పిల్లలు ఆపదలో ఉంటే తల్లి తల్లడిల్లిపోతుంది. కాపాడుకునేందుకు తన ప్రాణాన్నే అడ్డుపెడుతుంది. ఇలాంటి ఘటనకు సంభందించిన వీడియోలు కూడా మనం చాలా చూశాం.. చాలా స్టోరీలు కూడా విన్నాం. తాజాగా.. ఓ తల్లి శునకం తన పిల్లలు వరదలో చిక్కుకోవడంతో కుంగిపోయింది. కాపాడుకోవడం తన వల్ల కాదని తెలిసి.. రెస్క్యూ టీమ్ చుట్టూ తిరిగింది. అరుస్తూనే ఉండిపోయింది. తల్లి శునకం మూగ ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు.. కుక్క పిల్లలను కాపాడారు. చివరకు తల్లి చెంతకు చేర్చారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఏపీలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఇళ్లు కూడా నీటమునగడంతో నిరాశ్రయులు అయ్యారు. అయితే.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కాపాడేందకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసుల చుట్టూ ఓ కుక్క తిరిగింది. మొదట్లో పట్టించుకోకపోయినా.. పోలీసులు ఎటు వెళ్లినా అటే వచ్చి దీనంగా అరవడంతో.. గమనించారు. ఏంటా అని తల్లి కుక్క వెంటే వెళ్లారు. అయితే.. తల్లి కుక్క పోలీసులను ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లింది.
ఇంట్లో కుక్క యజమాని ఉండొచ్చు అని.. పోలీసులు కూడా ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పుడు అర్థమయ్యింది వారికి.. శునకం పిల్లలు ఇంట్లో ఇరుక్కున్నాయి.. వరద వల్ల పిల్లల వద్దకు చేరుకోలేకపోతుంది అని. దాంతో.. వెంటనే పోలీసులు శునకం పిల్లలను చేత్తో పట్టుకుని వరద దాటించి తల్లి చెంతకు చేర్చారు. అక్కడే ఉన్న కొందరు ఈ సహాయక చర్యలను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానవత్వం ప్రదర్శించిన పోలీసు అధికారులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.