కోతి కోసం కారు -మేనకాగాంధీ జంతు ప్రేమ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 6:04 AM GMT
కోతి కోసం కారు -మేనకాగాంధీ జంతు ప్రేమ..!

తోటి మనిషికి సహకరించాలి అంటే ఆమడ దూరం పారిపోయే రోజులివి. అలాంటిది ఒక కోతి కోసం కారు పంపించారు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ. రోడ్డుపక్కన గాయపడి కదలలేని స్థితిలో ఉన్న ఓ కోతి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. ఆ కోతికి వెంటనే చికిత్స అందించాలంటూ తన కారును పంపించారు.

దేశ రాజధాని ఢిల్లీలోని రైసినా రోడ్డులో ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ఫుట్ పాత్‌పై ఓ కోతి కదలలేని స్థితిలో ఉంది. ఆ కోతిని ఓ జర్నలిస్టు ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మేనకా గాంధీని ట్యాగ్ చేశారు. ఈ కోతి గాయపడి కదలలేని స్థితిలో ఉంది. ఏదైనా ఎన్జీవో గానీ, జంతు హక్కుల కార్యర్తలు గానీ ముందుకు వచ్చి కాపాడండి అంటూ మేనకా గాంధీని ట్యాగ్ చేసారు.

జర్నలిస్టు ట్వీట్‌కు వెంటనే స్పందించిన మేనకా గాంధీ.. తక్షణమే తాను కారును పంపించారు. తనను ట్యాగ్ చేసినందుకు ఆ జర్నలిస్టుకు ధన్యవాదాలు కూడా తెలిపారామె. ఆ కోతికి సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రంలో తగిని చికిత్స అందిస్తారు అని ఆమె సమాధానమిచ్చారు. కొన్ని క్షణాల్లోనే కారు అక్కడకు చేరుకుంటుందని ఆమె తెలిపారు. ఆమె చెప్పినట్లుగానే కొద్ది సేపటికే గాయపడిన కోతిని తీసుకెళ్లారని ఆ జర్నలిస్టు మరో ట్వీట్‌లో వెల్లడించారు. దీంతో జర్నలిస్టుతోపాటు మేనకా గాంధీ చేసిన పనికి నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జంతు ప్రేమికురాలిగా గొప్ప మనసు చాటుకున్నవంటూ కొనియాడుతున్నారు..

Next Story