అక్టోబర్ 4 నుంచి వైఎస్ఆర్ వాహన మిత్ర
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sept 2019 4:25 PM ISTఅమరావతి: పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. తాను పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా అర్హులైన డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.10వేలు ఇచ్చే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. హామీ నెరవేర్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 14 నుంచి 24 వరకు ఆటో, క్యాబ్ , టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కింద దరఖాస్తూ చేసుకోవచ్చంటూ ఏపీ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
రవాణాశాఖకు సంబంధించిన డీటీసీ స్థాయి నుంచి ఎంవీఐ ఆఫీస్ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే... ఈ- సేవ, మీ- సేవ, సీఎస్సీ, ఎండీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు వాలంటీర్ల వద్ద కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు.
డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఇన్స్యూరెన్స్, వెహికిల్ ఫిట్‌నెస్, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. డ్రైవర్ కమ్ ఓనర్లు ‘వాహన మిత్ర’ పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్ వివరాలను సమర్పించాలని అధికారులు తెలిపారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైతే తమ కులధృవీకరణ పత్రం కూడా సమర్పించాలని సూచించారు. సమర్పించిన ఆ డాక్యుమెంట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సంరక్షణలో ఉందో లేదో పరిశీలిస్తారు.
ఈ పథకంలో భాగంగా మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందాయి. వీటిలో నేటి వరకు 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 'వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం'ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ అధికారులు.