ఓబీసీ.. గుర్రం ఎక్కి పెళ్లి చేసుకుంటే తప్పా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 11:08 AM GMT
ఓబీసీ.. గుర్రం ఎక్కి పెళ్లి చేసుకుంటే తప్పా..?

నిమ్నకులంలో పుడితే డబ్బు, చదువు ఉన్నంత మాత్రాన గౌరవం రాదన్న విషయం అగర్ మాల్వాకి చెందిన ధర్మేశ్ పర్మార్ కి తెలిసి వచ్చింది. పెళ్లి ఊరేగింపులో గుర్రం మీద వస్తున్న పర్మార్ ను రాజపుత్ర అగ్రకులస్తులు కిందకి లాగి పారేశారు. వెనుకబడ్డ కులాల వారికి గుర్రమెక్కే అర్హత లేదంటూ ఆక్షేపించారు.

తాము సామాజికంగా ఎదగడం.. పై మెట్లుఎక్కడం అగ్రకులాల వారికి ఇష్టం లేదని ఎంకామ్ బీఈడీ చదివిన పర్మార్ అన్నాడు. పైగా చదువుకుని నాలుగు రాళ్లు సంపాదించిన కారణంగా తాము అగ్రకులస్తుల పొలాల్లో పనిచేయడం మానేయడం కూడా వారికి కంటగింపుగా మారిందని ఆయన అన్నాడు. తాము గుర్రం ఎక్కవచ్చా లేదా అన్న చిన్న చిన్న విషయాల్లోనూ అగ్రకులస్తుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నిస్తున్నాడు.

మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లా లోని భద్వాసా గ్రామంలో ఒకే ఒక్క పర్మార్ కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి .9.5 బిఘాల పొలం, ఒక బావి, రెండు ఎద్దులు, రెండు ఆవులు, పదిహేను మేకలు, నాలుగు ఇళ్లు, రెండు మోటర్ సైకిళ్ళు ఉన్నాయి. దేవేంద్ర పర్మార్ కి నెలకు పన్నెండు వేల జీతం వస్తుంది. ఇలా ఆ కుటుంబం కొంత ఆస్తిని కూడబెట్టుకోవడం ఆ ఊళ్లోని రాజపుత్రులకు కంటగింపుగా మారింది. “ఈ మాత్రం ఉంటేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మాకు ట్రాక్టర్ కూడా ఉంటే అసలు ఊళ్లో ఉండనిచ్చేవారే కాదు,” అంటుంది దేవేంద్ర తల్లి సరస్వతి.

మూడున్నర దశాబ్దాల క్రితం పరిస్థితి ఎంతో బాగున్నారని దేవేంద్ర తండ్రి కాలూరామ్ చెబుతున్నాడు. చిన్నప్పుడు ఆయన హాయిగా గుర్రం నడిపించేవాడు. రాజపుత్ర మిత్రులతో కలిసి పాడేవాడు, ఆడేవాడు. డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేవేంద్ర నవంబర్ 30 న పెళ్లి ఊరేగింపులో ఉండగా అతడిని గుర్రం మీదనుంచి కిందకు లాగడమ కాక, అతని కార్లను, మోటర్ సైకిళ్లను ధ్వంసం చేశారు. అతడిని, అతడి తండ్రి కాలూరామ్ ను చావ చితకబాదారు. గత ఇరవై ఏళ్లలో తొలి సారి ఒక ఓబీసీ గుర్రం ఎక్కాడు. ఆయన పెళ్లి ఊరేగింపులో కార్లున్నాయి. అంతే రాజపుత్రులు దీన్ని సహించలేక దాడులకు తెగబడ్డారని ఊరి సర్పంచ్ కైలాశ్ మాలవీయ చెప్పారు. మాలవీయ దళిత సముదాయానికి చెందిన వాడు.

Next Story