హర్ట్ అయిన అభిమానుల కోసం ఓపెన్ లెటర్ రాసిన ఎన్టీఆర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2020 12:02 PM GMTమే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందం ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. కానీ ఆ రోజు ఎలాంటి వీడియోను విడుదల చేయడం లేదట. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. లాక్‌డౌన్ పలుమార్లు పొడిగించడంతో చిత్రానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయని, ఎంతగా ప్రయత్నించినప్పటికీ తారక్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వలేకపోతున్నామని, కావున, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేము ఎలాంటి ఫస్ట్ లుక్ గానీ, వీడియో గానీ విడుదల చేయడం లేదని పేర్కొంది.
దీంతో హర్ట్ అయిన అభిమానుల కోసం ఎన్టీఆర్ ఓపెన్ లెటర్ ను రాశారు. టీజర్ లేదా ఫస్ట్ లుక్ కోసం టీమ్ ఎంతగానో ప్రయత్నించిందని తెలిపారు.
ప్రియమైన అభిమాన సోదరులకు నా విన్నపం
ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా వున్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను.
ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి వుండాలని నా విన్నపం.
ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి.
అలాగే, RRR చిత్రం నుండి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కావటం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను.
ఫస్ట్ లుక్ లేదా టీజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు.
రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తారు అని ఎన్టీఆర్ తెలిపారు.