ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షపార్టీల అసత్య ప్రచారం: మంత్రి కిషన్ రెడ్డి
By సుభాష్ Published on 26 Dec 2019 4:15 PM IST
ఎన్‌పీఆర్ అనేది ఎన్‌ఆర్‌సీకి ముందస్తు చర్యల్లో భాగమని, ప్రతిపక్షా పార్టీలు, మీడియాలోని ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. '2021 ఫిబ్రవరిలో జనగణన, ఎన్‌పీఆర్ చేపట్టనున్నట్లు, 2021లో జరగనున్న జనగణనలో అంతర్భాగం మాత్రమేనని అన్నారు. తాము గత యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పీఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. కాకపోతే మూడు, నాలుగు అదనపు అంశాలు జోడించి వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రుల పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్, చివరి నివాస స్థలం యన్ పీఆర్‌లో లో పొందుపరచనున్న కనీస ప్రాథమిక అంశాలేనని, ఈ విషయం లో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేయడానికి అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో సమర్థవంతంగా అమలవుతున్న సంక్షేమ ఎజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ లాంటి వివిధ పథకాల అమలు కి విఘాతం కల్గించడం వీరి లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు.