ఆస్ట్రేలియా ఓపెన్.. ఫెదరర్‌కు షాక్.. ఫైనల్ చేరిన జకోవిచ్
By Newsmeter.Network Published on 30 Jan 2020 6:09 PM ISTఆస్ట్రేలియా ఓపెన్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ . డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 7-6, 6-4, 6-3 తేడాతో గెలుపొందిన జకోవిచ్.. ఈ టోర్నీలో 8వసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఫెదరర్‌తో ముఖాముఖి రికార్డును జొకోవిచ్ 27–23కు పెంచుకున్నాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్‌తో తలపడిన ఐదు సార్లూ ఫెదరర్ ఓడిపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలి సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. జొకోవిచ్-ఫెదరర్‌లు ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ఆ సెట్ కాస్తా టై బ్రేక్‌కు వెళ్లింది. కాగా, టై బ్రేక్‌లో జొకోవిచ్ వరుస పెట్టి పాయిట్లు సాధించి ఫెదరర్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఈ క్రమంలోనే 7/1 టై బ్రేక్ పాయింట్లతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లో ఫెదరర్ పోరాడినప్పటికీ.. జొకోవిచ్ జోరు ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్ ఏకపక్షంగా జరగడంతో జొకోవిచ్ సెట్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్ కి అర్హత సాధించాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇప్పటి వరకూ ఏడు సార్లు ఫైనల్ (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019) ఆడిన జకోవిచ్.. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. జొకోవిచ్ ఇప్పటి వరకు 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. రెండో సెమీ ఫైనల్లో థీమ్-జ్వరేవ్‌ల మధ్య విజేతతో జొకోవిచ్ ఆమీతుమీ తేల్చుకోనున్నాడు.