ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఇప్పటికే 145 దేశాల్లో ఈ వైరస్‌ ప్రభావం ఉండటంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 114కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అనేక మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. దీంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి.

ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలు, థియేటర్‌లు, మాల్స్‌ను మూసివేసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. కరోనా ప్రభావం తగ్గే వరకు వీటిని మూసి ఉంచాలని ఆదేశాలిచ్చాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటాయనే ఉద్దేశంతో ప్రజలంతా మాస్కుల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా మాస్క్ ల కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో అధికారులు మెడికల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి మాస్క్ లను ఎక్కువ ధరలకు విక్రయించే దుకాణ యాజమాన్యాలను హెచ్చరించినా తీరు మారడం లేదు. దీంతో పలువురు మాస్క్ ల కోసం ఎంతైనా చెల్లించి దక్కించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మాస్కుల వాడకంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ మాస్కులు వాడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కరోనా లక్షణాలుగా కనిపిస్తే, కరోనా అనుమానితులు, కరోనా వైరస్‌సోకిన వారు, కరోనా సోకినవారి బాధ్యతలను తీసుకుంటే.. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ల దగ్గర పనిచేసే హెల్త్ వర్కర్ అయితేనే మాస్కులు వాడకం తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్