ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు..
By Newsmeter.Network Published on 9 April 2020 11:30 AM ISTప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికి 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన పలువురికి కోరనా వైరస్ సోకడంతో.. వారి ద్వారా కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఊహించని స్థాయిలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. లాక్‌డౌన్ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టింది. ఫలితంగా గురువారం ఉదయం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
Also Read :హెల్త్ బులిటెన్: దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్ కేసులు
బుధవారం సాయంత్రం వరకు 348 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బుధవారం రాత్రి 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు ఎలాంటి కోవిడ్ -19 కేసు నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ప్రభుత్వం, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తూ, పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని 10మంది డిప్యూటీ కలెక్టర్‌లను రాష్ట్ర కరోనా కంట్రోల్ రూమ్‌కు తాత్కాలికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలా ఉంటే జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 13, చిత్తూరు 20, తూర్పు గోదావరి 11, గుంటూరు 49, కడప 28, కృష్ణా 35, కర్నూల్ 75, నెల్లూరు 48, ప్రకాశం 27, విశాఖపట్టణం 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9మందికి నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కటి కూడా పాజిటివ్‌కేసు నమోదు కాలేదు.