ఇప్పుడు ఎక్కడ పెళ్లిళ్లు జరిగినా…భారీ మొత్తంలో కట్నం డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి ఎంత బాగున్నా కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ తాహతకు మించి అల్లుడిగారికి కట్నం సమర్పించుకోవాల్సిన పరిస్థితి. అమ్మాయి, అబ్బాయి చూడముచ్చటగా ఉన్నారా లేదా అన్న విషయం కూడా పట్టించుకోరు. ఇది అరేంజ్డ్ మ్యారేజీల కథ అయితే…లవ్ మ్యారేజ్ చేసుకునే వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావనుకోండి. అటు అబ్బాయి తరపువాళ్లు కట్నం డిమాండ్ చేస్తే…అమ్మాయి తరపు వారు బంగారం, పెళ్లి ఖర్చులు అని చెప్పి..తమకు కావాల్సినంతా రాబట్టుకుంటున్నారు. కానీ కేరళలో ఒక జంట అందుకు భిన్నంగా వ్యవహరించి, పెళ్లి వచ్చిన వారందరిచేత అభినందనలు పొందింది.

చందాయమంగళం గ్రామానికి చెందిన అజ్నా నజీమ్(24) కొల్లాం పట్టణంలో బీటెక్ చదువుతోంది. ఆమెకు గతేడాది డిసెంబర్ 29న పెరెడొమ్ కు చెందిన ఇజాస్ హక్కిమ్ (26)తో వివాహమయింది. ఇజాస్ తిరువనంతపురంలో సివిల్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ముస్లింల పెళ్లి వేడుకలో సాధారణంగా అయితే వధువుకు భారీ మొత్తం బంగారం పెట్టాలని కోరుతారు. కానీ ఇక్కడ మాత్రం వధువు తనకు నగలు కావాలనో, డబ్బు కావాలనో అడగలేదు. వాటికి బదులుగా 100 పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలని వరుడిని కోరింది. వధువు అడిగిందే తడవుగా అడిగిన పుస్తకాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు వరుడు. ఆమె కోరినట్లుగానే 100 పుస్తకాలను వారి పెళ్లి రోజున బహుమతిగా ఇచ్చాడు. వాటిలో ఖురాన్, భగవద్గీత, బైబిల్ కూడా ఉన్నాయి. వరుడు ఇచ్చిన బహుమతిని చూసి వధువు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆ వధువు నిజమైన టీచరమ్మ అని నిరూపించుకుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.