కరోనా ఎఫెక్ట్‌.. మా ఊళ్లోకి ఎవరూ రావొద్దు..

By Newsmeter.Network  Published on  24 March 2020 3:50 PM IST
కరోనా ఎఫెక్ట్‌.. మా ఊళ్లోకి ఎవరూ రావొద్దు..

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలోనూ కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుండటంతో ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్సపొందుతున్నారు. సోమవారం ఆరుగురికి పాజిటివ్‌ రాగా, మంగళవారం మధ్యాహ్నం వరకు ముగ్గురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. సోమవారం ప్రజలు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని ఇండ్లకు పంపించారు. ఇండ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని, వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎవరైనా బయటకు వస్తే పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చిన ఇండ్లకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు తమతమ ఊళ్లలోకి కొత్తవారు ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పలు గ్రామాల్లో ఊరి పొలిమేరల్లో ముళ్ల కంచెలు అడ్డుగా వేస్తూ కొత్తవారు రాకుండా, గ్రామంలోని వారు బయటకు పోకుండా చేస్తున్నారు. ఒకవేళ గ్రామంలోని వారికి అత్యవసరం అయితే ఒక్కరు మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌లో గ్రామ పొలిమేరలో రహదారికి అడ్డుగా పొడవాటి కర్రలను ఉంచి గ్రామానికి బయటి వారు రాకుండా అడ్డుకుంటున్నారు. దీనికితోడు గ్రామస్తులచే ప్రతి ఇంటి ముందు ఇంటి గడపను పసుపుతో కడగడం, ఇళ్ల ముంగిట ఆవు పేడతో కళ్లాపి చల్లడం వంటివి చేస్తున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రెపోన్నెపల్లి గ్రామంలో ప్రజలు ఐక్యంగా తమ గ్రామ పొలిమేరల్లో రహదారికి అడ్డుగా ముళ్లకంచెను ఉంచారు. అదే జిల్లా తొర్రూరు మండలంలోని సోమవరపు కుంటతండా గ్రామ పరిధిలో ఉన్న రోడ్డుకు అడ్డుగా ముళ్లకంచె, రాళ్లు అడ్డుగాఉంచారు. గ్రామంలోకి కొత్తవారు ఎవరూ రావొద్దని, అవసరమైతే తప్ప ఊళ్లోనుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా తమతమ గ్రామాలకు కొత్తవారు రావద్దంటూ ముళ్లకంచెలను అడ్డుగా పెడుతున్నారు.

Next Story