నిజాం డబ్బు రూ.325 కోట్లు భారత్ ఖాతా లోకి..!

By రాణి  Published on  14 Feb 2020 1:30 PM GMT
నిజాం డబ్బు రూ.325 కోట్లు భారత్ ఖాతా లోకి..!

బ్రిటీష్ బ్యాంకు అకౌంట్స్ లో మగ్గుతున్న హైదరాబాద్ నిజాంకు సంబంధించిన డబ్బు మొత్తం భారత్ కే చెందుతుందని తాజాగా తీర్పు వెలువడింది. ఆ డబ్బు కాజేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికపై చుక్కెదురైంది. దీంతో 70 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు గత ఏడాది అక్టోబర్ లో ఓ కొలిక్కి వచ్చింది. లండన్ లో ఉన్న భారత హై కమీషన్ కు ఆ డబ్బు చెల్లించడం విశేషం.

సెప్టెంబర్ 20, 1948 నుండి నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకు అకౌంట్ లో ఉన్న 35 మిలియన్ పౌండ్ల డబ్బు(325 కోట్ల రూపాయలు) తమకే సొంతం అంటూ పాకిస్తాన్ ఇన్నాళ్లూ అడ్డుపడుతూ వచ్చింది. కానీ పాకిస్థాన్ కు ఎటువంటి హక్కులూ లేవని లండన్ హై కోర్టు తేల్చేసింది. దీంతో ఆ డబ్బును లండన్ అధికారులు భారత హైకమీషన్ కు అందించారు. గత ఏడాది అక్టోబర్ లోనే నిజాం వారసుడు ముఖర్రం ఝాకు అనుకూలంగా కోర్టు తీర్పును ఇచ్చింది. ఆరేళ్ళ పాటూ లండన్ హై కోర్టులో ఈ డబ్బు తమకే సొంతమంటూ వాదిస్తూ వచ్చింది. మీకు ఎటువంటి హక్కులూ లేవని పాకిస్తాన్ కు చీవాట్లు పెట్టడమే కాకుండా.. 2.8 మిలియన్ పౌండ్లు(26 కోట్ల రూపాయలు) లీగల్ ఫీజుల కింద భారత్ కు చెల్లించాలని చెప్పింది. పాకిస్తాన్ ఇప్పటికే ఆ డబ్బు చెల్లించిందని ఉన్నతాధికారులు తెలిపారు.

భారత్ కు స్వాతంత్య్రం వచ్చాక అనేక సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాయి. హైదరాబాద్‌ మాత్రం విలీనం అవ్వలేదు.. అందుకు వేరే వేరే కారణాలున్నాయనుకోండి. అప్పుడు హైదరాబాద్ ను పాలిస్తున్న నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం కలవడానికి నిరాకరించాడు. దీంతో 1948లో సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఈ సమయంలో లండన్‌లో నాటి పాకిస్తాన్ దౌత్యవేత్త హబీబ్ ఇబ్రహీం రహీమ్‌తులా ఖాతాకు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1 మిలియన్ పౌండ్లను బదిలీ చేశాడు. రహీమ్ తులా దీనిని నాట్‌వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఆ నిధులు తమవేనని పాకిస్తాన్‌ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్‌ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంకు మద్దతుగా నిలిచారు. ఆ డబ్బు కాస్తా భారత్ సొంతమైనట్లు తీర్పు రాగా.. తాజాగా ఆ ధనాన్ని భారత్ కు అప్పగించడమే కాకుండా పాకిస్తాన్ కూడా అత్యాశకు పోయినందుకు భారత్ కు 2.8 మిలియన్ పౌండ్లు చెల్లించాల్సి వచ్చింది.

Next Story