బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం

By సుభాష్  Published on  19 March 2020 11:32 AM GMT
బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం

కల్వకుంట్ల కవిత.. ఎమ్మెల్సీగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగియనుంది. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు కవితను రాజ్యసభకు పంసిస్తారని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల సీనియర్‌నేత కేశవరావును పంపించారు. ఆయనతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డికి కూడా అవకాశం కల్పించారు. దీంతో కవితకు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యసభకు పంపించలేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది.

2015లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొంది, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4వరకు ఉండటంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ చేపట్టింది.

బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం..

కాగా, బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం తలెత్తుతోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జరిగినట్లు ఫలితాలు మళ్లీ రిపీట్‌ అవుతాయేమోననే సందేహం వ్యక్తం అవుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు కవిత నామినేషన్‌ వేశారు. కవిత నామినేషన్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉండటంతో కవిత విజయం సునాయాసమే. అయినా సరే ఎలాంటి పొరపాట్లు జరుగకుండా సీఎం కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగారు.

ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 2018 ఎన్నికల్లో ఒక్క స్థానం తప్ప అన్ని సెగ్మెంట్లలో విజయం సొంతమైంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ జిల్లాలో ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యే లేకుండా పోయారు. కాగా, తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కవితకు పరాజయం తప్పలేదు. అక్కడ బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్‌ గెలుపొందారు. కేసీఆర్‌ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కూడా ధర్మపురి అరవింద్‌కు తరలిపోవడం వల్లనే కవిత ఓటమి పాలయ్యారని అప్పట్లో టాక్‌ వినిపించింది.

అధికార పార్టీ నేతల్లో ఆందోళన

ఇక నిజామాబాద్‌లో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున కవిత, బీజేపీ తరపున లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ కూడా బరిలో దిగింది. ఇక చివరి నిమిషంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఏకమవుతాయన్న అనుమానాలు ఇప్పుడు అధికార పార్టీ నేతలకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఓట్లను వేయించే బాధ్యతను నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించారు కేసీఆర్‌. అంతేకాదు.. పూర్తి బాధ్యత మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేతిలో పెట్టేశారు. కవిత ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేలా పని చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా ప్రతినిధుల ఓట్లు ఎక్కడ జారిపోతాయన్న ఆందోళన..

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 840 ఓట్లకుపైగా ఉన్నాయి. వీటిలో దాదాపు 540 ఓట్లు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలకు చెందినవే కావడంతో కవిత గెలుపు సునాయాసమేనని ధీమాగా ఉన్నారు. ఇక బీజేపీ , కాంగ్రెస్‌ ఒప్పందం చేసుకున్నా వాటి ఓట్ల సంఖ్య 300కు మించదని తెలుస్తోంది. అయినా తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ఎక్కడ జారీపోతాయన్న ఆందోళన మొదలైంది. అందు కోసం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది టీఆర్‌ఎస్‌.

Next Story