నిజామాబాద్ ఆస్పత్రిలో కరోనాతో నలుగురు మృతి.. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
By సుభాష్ Published on 10 July 2020 10:04 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో కరోనా కాలరాస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు మృతి చెందడంతో తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు కరోనా పేషంట్లు ఒకేసారి మరణించడంతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై సమీక్షించారు.
చికిత్స పొందుతున్న వారికి సరైన ఆక్సిజన్ అందకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టారు. ఆక్సిజన్ అందకపోవడంతోనే మృతి చెందారు.. లేక వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం వల్ల మృతి చెందారా.. అనే అంశాలపూ పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆస్పత్రి వైద్యులు,సిబ్బందిని విచారించి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
కాగా, జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసుల నమోదు కాకపోగా, ఇటీవల కాలం నుంచి జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్రంగా విస్తరిస్తోంది. అయితే కరోనాకు వ్యాక్సిన్ లేని కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే తప్ప తగ్గే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే మాస్క్ లు ధరించాలని, అలాగే భౌతిక దూరం తప్పనిసరి అని చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నా... కొందరి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా పెరిగిపోతుందని అంటున్నారు.