ఇక నితిన్ గడ్కరీయే దిక్కా?

By రాణి  Published on  3 Jan 2020 6:50 AM GMT
ఇక నితిన్ గడ్కరీయే దిక్కా?

మోదీ మహానాయకుడే కావచ్చు. అమిత్ షా అపర చాణక్యుడే కావచ్చు. కానీ అన్నీ వారే చేయగలరా? వారు తీసుకునే నిర్ణయాలన్నీ సరైనవేనా? అసలింక పార్టీలో వేరే అభిప్రాయాలకు తావే లేదా? ఇప్పుడు ఈ ప్రశ్నలే బిజెపి ఆంతరంగికులు వేస్తున్నారు. పైకి గట్టిగా చెప్పకపోయినా లోలోపల మాత్రం చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు.

రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి నాయకులకు ప్రస్తుతం పార్టీలో ఉన్న స్థానం ఏమిటి? రాజనాథ్ కనీసం ఏడవ పడిలో పడ్డారు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలి. దీంతో ఇంక పాతతరం జాతీయ నాయకులంటూ బిజెపిలో ఎవరూ మిగలరు. కాబట్టి ఆయనను నెమ్మదిగా హోం నుంచి రక్షణ శాఖకు పంపారు. ఆయన స్థానం పార్టీలో రెండో నంబర్ నుంచి మూడో నెంబర్ కు దింపేశారు. దీంతో జరగబోయేది ఆయనకూ అర్థమైపోయింది.

మిగతా నాయకులంతా కేవలం తమ తమ ప్రాంతాలకు, క్షేత్రాలకు పరిమితమైపోయారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ వంటి నాయకులకు సొంత బలం లేదు. సంబిత్ పాత్ర వంటి నాయకులకు టీవీ చానెల్ మైకుల ముందు తప్ప మరెక్కడా స్థానంలేదు. వచ్చే ఎన్నికలకు ఏడు పదులు దాటుతున్న నాయకులంతా రిటైర్ అయిపోతారు. ఇక జాతీయ స్థాయిలో మోదీ-షా ద్వయానికి ఉన్న ఏకైక అడ్డంకి నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ తో మోదీ షాలకు సమస్యేమిటంటే ఆయన ఆరెస్సెస్ కు సన్నిహితులు. నాగపూర్ నివాసి. గతంలో పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో ఆయనకు దేశమంతటా పరిచయాలు ఉన్నాయి. పట్టు కూడా ఉంది. అంతే కాదు. రాజనాథ్ కి లేనిది ఆయన దగ్గర ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఆయన వయసులో చిన్నవారే. ఆయన్ని రిటైర్ చేయించడం సాధ్యం కూడా కాదు. దాంతో మోదీ-షా ద్వయం ఆయనను పూర్తిగా పక్కన పెట్టగలిగిందే తప్ప పూర్తిగా పక్కకు తప్పించలేకపోయింది.

చావుతప్పి కన్ను లొట్టబోయినంత పనైంది

అయితే బిజెపికి ఇటీవలి కాలంలో కాస్త గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. హర్యాణాలో పార్టీ చావు తప్పి కన్ను లొట్టపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్ ఎలాగోలా ముఖ్యమంత్రి అయితే అయ్యారు కానీ గతంలోని ప్రాభవ ప్రభావాలు ఇప్పుడు లేవు. మహారాష్ట్రలో ఖాయం అనుకున్న అధికారం పార్టీకి గాయాన్ని మిగిల్చింది. దశాబ్దాల దోస్తు బీజేపీని వీడటమే కాదు, పార్టీ ఇప్పుడు విపక్షంలో కూర్చోవాల్సి వస్తోంది. జార్ఖండ్ లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. ఆఖరికి ముఖ్యమంత్రి సైతం ఓడిపోయారు. గత రెండేళ్లలో ఒక్క లోకసభ ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ప్రదర్శన నిరాశాజనకమే. ఈ పరిస్థితుల్లో మిత్ర పక్షాలన్నీ ఇప్పుడు గళం విప్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోదీ-షా ద్వయానికి దిక్కు తోచడం లేదు. ఢిల్లీ, తమిళనాడు, బీహార్ లలోనూ వ్యతిరేక పవనాలు వీస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందన్నది బహిరంగ రహస్యం, ఇప్పుడు ఈపరిస్థితుల్లో పార్టీకి దిక్కెవరు?

ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ ప్రాధాన్యం పెరుగుతోంది. మహారాష్ట్ర విషయంలో ఆయన సలహాలను పెడచెవిన పెట్టడం వల్లే పార్టీ దెబ్బతిన్నదన్నది ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది. వివిధ అంశాల్లో ఆయన ఆలోచనా విధానం పార్టీకి ఎంతో ఉపయోగపడుతోందన్నదీ ఇప్పుడు పార్టీ నేతల గమనంలోకి వస్తోంది. అందుకే ఇక రానున్న రోజుల్లో నితిన్ గడ్కరీ ప్రాధాన్యం మరింత పెరగనుందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

Next Story