దిశ ఘటనపై 'నిర్భయ' తల్లి స్పందన..!

By అంజి  Published on  6 Dec 2019 5:23 AM GMT
దిశ ఘటనపై నిర్భయ తల్లి స్పందన..!

దిశ హత్యాచారం కేసులో తక్షణ న్యాయం జరిగినట్టు రాష్ట్ర ప్రజలే కాదు దేశవాసులంతా భావిస్తున్నారు. నిందితులను జైల్లో ఉంచి సుబ్బరంగా తిండిపెట్టి, సకల సదుపాయాలూ కల్పించడం అన్న ఆలోచనే భరించలేపోతున్నామన్న ప్రజలు, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఒక దరిద్రం ఒదిలిపోయిందని భావిస్తున్నారు. ఐతే... ఎప్పుడో 2012లో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఇప్పటికీ శిక్ష పడకపోవడం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఎన్కౌంటర్ పై స్పందించిన నిర్భయ తల్లి కూడా అదే మాట అన్నారు. 2012 లో నిర్భయ ఘటన అనంతరం నాకు తగిలిన గాయాలకు ఈ ఎన్‌కౌంటర్ తో ఆయింట్మెంట్ పూసినట్టు ఉందన్నారు. కనీసం ఒక్క ఆడబిడ్డకైనా న్యాయం జరిగి నందుకు సంతోషంగా ఉందన్నారు. దిశ తల్లిదండ్రులకు 7 రోజుల్లో న్యాయం జరగడం ఆనందం కలిగించిందన్నారు. తెలంగాణ పోలీసుల గొప్ప పని చేశారన్నారు. నిర్భయ కోసం నేను ఏడేళ్లుగా పోరాడుతున్నాను. వారిని శిక్షించడంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

2012 డిసెంబర్ 16న రాత్రి నిర్భయ దారుణం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే మొత్తం ఆరుగురిని దోషులుగా గుర్తించారు. వారిలో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన ఐదుగురిలో ఒకరు మైనర్ కావడంతో ఎంచక్కా మూడేళ్ల తర్వాత రిలీజైపోయాడు. ఇప్పుడు మిగతా నలుగురు జైల్లో ఉంచి మేపుతున్నారు. వీరిలో ఒకడు క్షమాభిక్ష కోసం కూడా వేడుకున్నాడు. దానికి రాష్ట్రపతి అనుమతించలేదు. నిందితులకు ఇప్పటికీ శిక్ష అమలుకాకపోవడంపై మరోసారి తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.

1600x960 277830 Disa

నిజానికి ఢిల్లీ నిర్భయ కేసులో దోషులకు నలుగురికీ 2017 మే 5న ఉరిశిక్ష విధించింది సుప్రీంకోర్టు. ఐతే అది ఇప్పటికీ అమలు కాలేదు. అప్పటి నుంచీ ఇప్పటివరకూ… అంటే అరెస్టు చేసినప్పటి నుంచీ ఏడేళ్లుగా జైళ్లలో ఉంచి మేపుతున్నారనీ... దిశ హత్యాచారం కేసులో జరిపినట్లే ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలని చాలా మంది కోరుతున్నారు. పోనీ ఎన్‌కౌంటర్‌లో కాకపోతే... కోర్టు ప్రకారం... ఉరిశిక్ష విధించాలని కోరుతున్నారు.



Next Story