ఎన్నో అడ్డంకులు.. ఎన్నో అనుమానాలు.. చివరికి రేపు ఉదయం..!

By సుభాష్  Published on  31 Jan 2020 11:10 AM GMT
ఎన్నో అడ్డంకులు.. ఎన్నో అనుమానాలు.. చివరికి రేపు ఉదయం..!

►నిర్భయ కేసులో రకరకాల వాదనలు

►ఎన్నో చిక్కులు

►రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న వినయ్‌ శర్మ మెర్సీ పిటిషన్‌

►1982 కేసును గుర్తు చేస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు ఉరిశిక్ష పడనుంది. దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులైన ముకేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకుమార్‌, పవన్ గుప్తా, వినయ్‌ శర్మలను క్షమించేదిలేదని, ఉరి తీయల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నలుగురు కలిసి ఒకే నేరానికి పాల్పడినందున విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిని వేర్వేరుగా కాకుండా ఒకేసారి ఉరి తీయాలని సుప్రీం కోర్టు ఇది వరకే స్పష్టం చేసింది. దోషులు మెర్సీ, క్యురేటివ్‌ పిటిషన్లను వేర్వేరుగా దాఖలు చేయడం, అటు రాష్ట్రపతి, ఇటు జడ్జిలు ప్రతి ఒక దోషి వాదనను వేర్వేరుగా వినడం అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

నిర్భయ కేసు సందర్భంగా ఇప్పుడు 38 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. 1982లో ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ కేసులో ఓ దోషికి అన్యాయం జరిగింది. దోషుల్లో ఒకరికి అన్యాయం జరుగగా, ఆ కేసులో ఒకరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించగా, మరొకరి ఉరిపై కోర్టు స్టే విధించింది. ఇక మూడో దోషి పరిస్థితి విచిత్రంగా మారింది. ఇలా అప్పటి కేసును దృష్టిలో ఉంచుకుని ఒకే కేసులో ఉన్నవారందరిని వేర్వేరుగా ఉరి తీయకుండా, ఒకేసారి ఉరి తీయాలన్న తీర్పునకు దారి తీసింది. 1982లో జరిగిన అన్యాయం మళ్లీ జరుగకుండా ఉండేందుకు దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు తీహార్ జైలు మాన్యువల్ ఏం చెబుతోంది..

ఇక నిర్భయ కేసులో వినయ్‌ శర్మ మెర్సీ పిటిషన్‌ ఇంకా రాష్ట్రపతి వద్దనే పెండింగ్‌లో ఉండగా, మరో ఇద్దరు క్షమాభిక్ష పిటిషన్లను దాఖలు చేయలేదు. ఇక ముకేష్‌ సింగ్‌కు న్యాయపరమైన దారులన్నీ మూసుకుపోయాయి కనుక అతన్ని ఉరితీయవచ్చంటున్నారు న్యాయ నిపుణులు. వినయ్‌ శర్మను ఫిబ్రవరి 1న ఉరి తీయబోరని, మిగిలిన ముగ్గురు దోషులను ఉరితీయవచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వినయ్‌ శర్మ మెర్సీ పిటిషన్‌ రాష్ట్రపతి వద్దనే ఉంది. అది పెండింగ్‌లో ఉండగా, అతని పిటిషన్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చినప్పటికీ, నిబంధనల ప్రకారం అతడికి ఇంకా 14 రోజుల సమయం ఉంటుంది. అలాగే అక్షయ్‌ కుమార్‌ మెర్సీ పిటిషన్‌ దాఖలు చేసేందుకు కూడా అవకాశం ఉంది. దాంతో అతడికి కూడా 14 రోజుల పాటు సమయం లభించే అవకాశం ఉంది. ఇక మరో దోషి పవన్‌ కుమార్‌ గుప్తా ఒక్కడే క్యురేటివ్‌ గానీ, మెర్సీ పిటిషన్‌ గానీ దాఖలు చేయలేదు. తన ఉరిశిక్షను జాప్యం చేసేందుకు అవకాశం ఉంది. కానీ ముకేష్‌ సింగ్‌కు ఎలాంటి న్యాయమార్గాలు లేకపోవడంతో మొదట అతనికే ఉరి వేయవచ్చని తీహార్‌ జైలు మన్యువల్‌ అభిప్రాయపడుతోంది.

మాన్యువల్‌ నిబంధనల ప్రకారం..

ఇక మాన్యువల్‌ నిబంధనల ప్రకారం ఒకే నేరంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్న దోషులకు ఉరిశిక్ష విధించిన సందర్భంలో అందులో ఏ ఒక్కరు అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసినా.. ఇతర నిందితుల శిక్షలను వాయిదా వేయవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. మొత్తం మీద నిర్భయ దోషుల ఉరిపై జైలు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. 2012, డిసెంబర్‌ 16న ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారం కేసులో అనాటి నుంచి నేటి వరకు ఎన్నో అడ్డంకులు ఎదురై చివరకు వచ్చింది. ఇప్పుడు చివరి దశలో కూడా అధికారులకు తలనొప్పులు తప్పడం లేదు.

Next Story