నిర్భయ కేసు.. అప్పుడు నాకు 17 ఏళ్లే..!

By అంజి  Published on  21 Jan 2020 2:36 AM GMT
నిర్భయ కేసు.. అప్పుడు నాకు 17 ఏళ్లే..!

నిర్భయ ఘటన సమయానికి తనకి 17 ఏళ్ళే అంటూ దోషి పవన్‌ గుప్తా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నిర్భయ కేసు సమయంలో దోషి పవన్‌ గుప్తా వయసు 17 సంవత్సరాల ఒక నెల 20 రోజులని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ న్యాయస్థానానికి వెల్లడించారు. అందువల్ల అతడిని జువైనల్‌గా పరిగణించాలని కోర్టును కోరారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో పవన్‌ జువైనల్‌ అనే విషయాన్ని దిల్లీ హైకోర్టు పరిగణించలేదని సింగ్‌ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ విషయం పై న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ లో పరిశీలించాల్సిన అంశాలు ఏమీ తమకు కనబడలేదు అన్నారు జస్టిస్ అశోక్ కుమార్. గతంలో కూడా పవన్ జువైనల్ అంటూ పిటిషన్ వేయగా అవి తిరస్కరణకు గురయ్యాయి అని దానిని మళ్లీ తాము లేవనెత్తలేమన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందించారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకే దోషులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరి తీసిన రోజే తాను సంతృప్తి చెందుతానన్నారు.

నిర్భయ దోషులను ఈనెల 22న ఉరి తీయాల్సిందిగా డిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. కానీ దోషుల్లో ఒకడైన ముకేశ్‌ వేసిన క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరి తేదీ మార్చాల్సిందిగా తీహాడ్‌ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సిందిగా కోర్టు మరోసారి డెత్‌వారెంట్‌ జారీ చేసింది. ముకేశ్‌ వేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో వాళ్ల ఉరి ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం వాళ్లు తీహాడ్‌ జైల్లో ఉన్నారు. ఉరి నిమిత్తం వారిని తీహాడ్‌ జైల్లోని మూడో నంబరు కారాగారానికి తరలించారు.

Next Story