నిర్భయ దోషి సానుభూతికి అనర్హుడు

By రాణి  Published on  18 Dec 2019 7:47 AM GMT
నిర్భయ దోషి సానుభూతికి అనర్హుడు

న్యూఢిల్లి : ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా ఉన్న అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. కాగా ఈ విచారణలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే మంగళవారం ధర్మాసనం నుంచి తప్పుకోవడంతో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. తొలుత న్యాయస్థానంలో అక్షయ్ సింగ్ తరపున లాయర్ ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. మీడియా, రాజకీయ నాయకుల ఒత్తిడుల వల్లే అక్షయ్ ను దోషిగా తేల్చారని వాదించారు. అలాగే నిర్భయ మరణ వాంగ్మూలంలో కూడా తనకు అనుమానాలున్నాయని, చనిపోయే ముందు నిర్భయ ఇచ్చిన వాంగ్మూలంలో అక్షయ్ పేరు ఎక్కడా చెప్పినట్లు లేదని ఏపీ సింగ్ గుర్తు చేశారు. జన్మతహా ఎవరూ రేపిస్టులుగా మారరని, సమాజమే వారినలా తయారు చేస్తుందని, సరైన విద్య లేని కారణంగా కూడా చాలామంది నేరస్థులుగా మారుతున్నారని లాయర్ అన్నారు.

అలాగే దేశ వ్యాప్తంగా విధిస్తున్న మరణశిక్షలను కూడా ఏపీ సింగ్ వ్యతిరేకించారు. ఉరిశిక్షలనేవి మాన హక్కులకు పూర్తిగా వ్యతిరేకమని, మనదేశ సంస్కృతికి ఇది విరుద్ధమని ఖండించారు. అహింసా మార్గాన్ని ఎంచుకున్న జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఈ శిక్షలను వ్యతిరేకించారన్నారు. ఇప్పటికే ఢిల్లిలో పెరిగిపోయిన కాలుష్యం మనుషుల ఆయుషుని తగ్గిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా మరణశిక్ష విధించాల్సిన అవసరం ఏముందని ఏపీ సింగ్ ప్రశ్నించారు.

మానవత్వానికే మాయని మచ్చ

లాయర్ ఏపీ సింగ్ వాదనల అనంతరం ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అక్షయ్ రివ్యూ పిటిషన్ ను వ్యతిరేకించారు. మానవ జన్మ ఎత్తాక మనుషుల్లాగే మెలగాలి కానీ, పశువుల్లాగా కాదన్నారు. కొన్ని నేరాలు మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోతాయని, వాటిలో నిర్భయ లాంటి ఘోరమైన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ సానుభూతి పొందేందుకు అనర్హుడని, ఇలాంటి రాక్షసుడిని పుట్టించినందుకు, ఈ రాక్షసుడి బారీ నుంచి కాపాడలేకపోయినందుకు దేవుడు కూడా సిగ్గుపడుతాడని ఆవేదన చెందారు. ఈ కేసులో శిక్షను తప్పించుకునేందుకు దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ దోషులను వదలవద్దని లాయర్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

Next Story
Share it