ఢిల్లీలో సంచ‌ల‌న సృష్టించిన నిర్భ‌య కేసులో నిందితులుగా తేలిన న‌లుగురికి త్వ‌ర‌లో ఉరిశిక్ష ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో తీహార్ జైల్లో ఉన్న న‌లుగురు దోషులు తీవ్ర నిరాశ‌లోఉన్న‌ట్లు జైలు అధికారులు వెల్ల‌డిస్తున్నారు. నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన పవన్ కుమార్ గుప్తా, ముకేశ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌సింగ్‌‌లను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచారు. ఒక్కొక్కరికి ఐదుగురు పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. నిర్భయ కేసు దోషి అయిన రాంసింగ్ 2013లో జైల్లో ఆత్మహత్య చేసుకోగా, ఇంకో దోషి బాల‌నేర‌స్థుడిగా ప‌రిగ‌ణించి మూడేళ్లు జైలు శిక్ష విధించారు. మిగిలిన న‌లుగురు దోషుల‌కు సుప్రీం కోర్టు ఉరి విక్ష విధించింది.ఈ న‌లుగురు దోషుల‌కు పోలీసులు నిరంత‌రం ప‌హ‌రా కాస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ నలుగురు దోషుల‌ను కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు ప‌ర్చారు. దోషుల గురించి కోర్టు జైలు అధికారుల‌ను ప‌లు విష‌యాల‌ను అడిగి తెలుసుకుంది. వీరికి ఉరిశిక్ష స‌మీపిస్తుండ‌టంతో జైల్లో వారి ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుంద‌నే విష‌యంపై కోర్టు ప్ర‌శ్నించింది.

కోర్టు అడిగిన అంశాల‌పై జైలు అధికారులు ప‌లు విష‌యాల‌ను తెలిపారు. ఈ న‌లుగురు దోషులో జైల్లో స‌రిగ్గా తిండి తిన‌డం లేద‌ని తీహార్ జైలు అధికారులు చెప్పారు. ఉరి శిక్ష వేసేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చింత‌లో మాన‌సికంగా కుంగిపోతున్నార‌ని వివ‌రించారు. వీరు గ‌తంలో పుష్టిగా భోజ‌నం చేసేవార‌ని, ఇప్పుడు తినే ఆహారం తగ్గించారని జైలు అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. ఉరి శిక్ష నేప‌థ్యంలో ఉరి తీయనున్న 3వ నంబరు ఉరి స్తంభం ప్రాంతాన్ని తీహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయల్ తోపాటు ఇతర జైలు సీనియర్ అధికారులు సందర్శించి, ఉరి శిక్ష సన్నాహాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉరిశిక్ష‌కు సంబంధించిన ప‌నుల‌ను అధికారులు ద‌గ్గ‌రుండి చూసుకోవాల‌ని సూచించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.