నిర్భయ నిందితుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ మళ్లీ శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తాజాగా ఢిల్లీ కోర్టులో అతనొక పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ పై అత్యాచార ఘటన జరిగిన రోజు అంటే..డిసెంబర్ 16వ తేదీన తానసలు ఢిల్లీలోనే లేనని చెప్పుకొచ్చాడు. తనకేం సంబంధం లేకపోయినా డిసెంబర్ 17,2012న రాజస్థాన్ పోలీసులు తనను బెదిరించి ఢిల్లీ తీసుకొచ్చి తీహాడ్ జైలులో చిత్ర హింసలకు గురిచేశారంటూ పిటిషన్ లో ఆరోపించాడు. ఇలా మరో కొత్త నాటకానికి ముఖేష్ తెరలేపాడు. కాబట్టి తనకు మరణశిక్ష రద్దు చేయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు అడిషినల్ సెషన్స్ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ఎదుట తన పిటిషన్ ను ఉంచాడు.

Also Read : కరోనాను లెక్కచేయని ప్రభాస్ టీం

కాగా..ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులు నలుగురినీ ఉరితీసేందుకు 5వ తేదీనే కోర్టు ట్రయల్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. గతంలో కూడా మరణశిక్ష సమయాన్ని, తేదీని తెలియజేస్తూ డెత్ వారెంట్లు ఇచ్చిన కొద్ది రోజులకు ఏదొక పిటిషన్ వేస్తూ మరణశిక్షను వాయిదా వేసేలా ప్లాన్ చేశారు నిర్భయ దోషులు. తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ..ఒక్కొక్కరిగా కోర్టులో పిటిషన్లు, క్షమాభిక్షలకు అప్లై చేశారు. ఇది కూడా మరణశిక్ష సమయం దగ్గరకొస్తున్నప్పుడే చేస్తున్నారు. మరో మూడ్రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష అమలవుతుందనగా ముకేష్ సింగ్ పిటిషన్ వేయడం వల్ల మరణశిక్ష మళ్లీ వాయిదా పడుతుందా ? లేదా పిటిషన్ ను కొట్టివేసి మరణశిక్ష ను యథాతదంగానే కోర్టు అమలు చేస్తుందా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

Also Read : కరోనా పై ఆర్ఆర్ఆర్ హీరోలు చెప్పిన ఆరుసూత్రాలివే (వీడియోతో)

జనవరి 22న, ఫిబ్రవరి 1న, మార్చి2న ఇలా ఇప్పటి వరకూ మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. ఆఖరికి ఈ దోషులు ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా వదల్లేదు. ఒకవేళ వీరు పిటిషన్ల తాకిడిని తట్టుకోలేక శిక్ష తగ్గించినా..ఈ నిందితులు బయటికొచ్చాక ప్రజలైతే ఖచ్చితంగా బ్రతకనివ్వరన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెండ్రోజుల క్రితం నిందితుల కుటుంబ సభ్యులు తమవాళ్లకి కారుణ్య మరణాలను ప్రసాదించాల్సిందిగా కూడా కోరారు. కానీ..దానికి కోర్టు, ప్రభుత్వం ఒప్పుకోలేదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.